Pawan Kalyan:జనసేనానికి ఐర్లాండ్ 'ఓడ కళాసి' లేఖ.. కన్నీళ్లు పెట్టుకున్న పవన్‌కల్యాణ్..
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు సినిమా హీరోగా.. అటు రాజకీయ నాయకుడిగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. అభిమానుల కంటే భక్తులు అనడం కరెక్ట్‌గా ఉంటుందేమో. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనే పవన్‌ను ఆరాధించే వారు.. అనుసరించే వారు ఉన్నారు. అయితే గత పదేళ్లుగా పార్టీ గెలుపు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వారు.. ఈసారైనా గెలుపు బావుటా ఎగరేయాలని బలంగా కోరుకుంటున్నారు.
తాజాగా ఐర్లాండ్‌లో గత 17 ఏళ్లుగా ఉంటున్న ఓ అభిమాని.. స్వయంగా పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. పార్టీని బలోపేతం చేయాలని కోరారు. 2014లో నిలబడ్డామని.. 2019లో బలపడ్డామని.. 2024లో బలంగా కలబడాలని ఆ అభిమాని పిలుపునిచ్చారు. తన చేతులో స్వయంగా లేఖ రాసిన అతను తనను తాను "ఓడ కళాసీ"గా పరిచయం చేసుకున్నాడు.
లేఖ సారాంశం ఇదీ.
అన్నా..
కష్టాలు, కన్నీళ్లు, రుణాలు దారుణాలు... కారణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లెందరికో.. ఒక్కటే నీమీద ఆశ! ఎక్కడో బలీవియా అడవుల్లో అంతమై పోయిందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?
సరికొత్త గెరిల్లా వార్ ఫైర్‌ని మొదలెట్టకపోతావా? మన దేశాన్ని.. కనీసం మన రాష్ట్రాన్నయినా.. మార్చక పోతావా?
17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా.. ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక.. ఎదురు చూస్తున్న నాలాంటివాళ్లందరం.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం.
2014 - నిలబడ్డాం
2019 - బలపడ్డాం
2024 -బలంగా కలబడదాం!
కారుమీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారుమబ్బులు కమ్ముతున్నా... కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్‌వి నువ్వే కదన్నా!! నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి. - ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసి.
కన్నీరు తెప్పించావు..
ఈ లేఖపై పవన్ కల్యాణ్ ఆవేదనతో స్పందిస్తూ ట్వీట్ చేశారు. "ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీగా పని చేస్తున్న నా జనసేన అభిమానీ నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు" అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఆచితూచి అడుగులు..
కాగా గత రెండు ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయినా జనసేన పార్టీ.. ఈసారి చట్టసభల్లో అడుగుపెట్టాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బలమైన పార్టీగా నిలబడ్డాలని ఆకాంక్షిస్తున్నారు. వారి ఆశలకు తగ్గట్లే పవన్ కల్యాణ్ ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. దీంతో ప్రభుత్వంలో జనసేన భాగ్యస్వామ్యం నెలకొల్పాలని ముందుకు సాగుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments