లాక్‌డౌన్ పొడిగింపు పక్కా.. IRCTC సంకేతాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి మార్చి 24 నుంచి ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం విదితమే. మరికొన్ని రోజుల్లో ఈ లాక్‌డౌన్ పూర్తి కానుంది. ఇప్పట్లో లాక్‌డౌన్ ఎత్తేద్దామన్నా అయ్యే పనికాదు. ఎందుకంటే రోజురోజుకూ దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య.. మరణాల సంఖ్య పెరుగుతోందో కానీ అస్సలు తగ్గట్లేదు. ఈ క్రమంలో లాక్‌డౌన్ పొరపాటున ఎత్తేస్తే ఒక్కసారిగా ఊహించని రీతిలో కేసులు పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడిక దేశాన్ని కంట్రోల్ చేయడం అస్సలు అయ్యే పనే కాదని పలువురు విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్రం కూడా లాక్‌డౌన్ పొడిగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్-11న మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారు. బహుశా ఆ ప్రకటన లాక్‌డౌన్ పొడిగింపుపైనే ఉండొచ్చు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని కేంద్రంపై గట్టిగానే ఒత్తిడి తెస్తున్నాయి.
కచ్చితంగా పొడిగింపే..
ఈ క్రమంలో రైల్వేశాఖ ఓ కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే.. టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో తేల్చిచెప్పేసింది. అంటే.. లాక్‌డౌన్ కచ్చితంగా ఉంటుందని దీన్ని బట్టి స్పష్టంగా తెలిసిపోయింది. ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన తెరపైకొచ్చింది. ఏప్రిల్-14 తర్వాత లాక్‌డౌన్ దశలవారిగా ఎత్తేస్తారని మొదట్నుంచి కేంద్రం చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఐఆర్సీటీసీ తాజాగా ఈ ప్రకటన చేసిందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రాల ఆర్టీసీలు సైతం ఇంతవరకూ ఏప్రిల్-14 తర్వాత బస్సులు తిరుగుతాయని కానీ.. టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చని కానీ ఎక్కడా చెప్పలేదు.
ముందే అప్రమత్తమా..!?
ముందుగానే ఆర్టీసీ, ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. లాక్‌డౌన్ పొడిగింపును అధికారికంగా ఏప్రిల్-11న ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి శనివారం నాడు మోదీ ఏం చెప్పబోతున్నాడు..? రాష్ట్రాల ముఖ్యమంత్రుల డిమాండ్‌నే మోదీ అమలు చేస్తారా..? లేకుంటే మోదీ దగ్గర మరో ప్లాన్ ఏమైనా ఉందా..? అనేది తెలియాలంటే కీలక ప్రకటన వచ్చినంతవరకూ వేచి చూడక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout