హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్... ఇరానీ ఛాయ్ ధరల పెంపు, కప్పు ఎంతో తెలుసా..?

  • IndiaGlitz, [Friday,March 25 2022]

ఇరానీ చాయ్... హైదరాబాద్‌కు ఎవరొచ్చినా బిర్యానీ తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చేసేది దీనినే. కమ్మనైన సువాసనతో పాటు మంచి రుచి దీని సొంతం. రుచిలో మాత్రమే కాదు.. చేసే విధానం కూడా ప్రత్యేకమే. ఉస్మానియా బిస్కెట్స్, సమోసాలతో ఇరానీ ఛాయ్ తాగడాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఒత్తిడిగా వున్నా.. మనసు బాగోకపోయినా ఇరానీ ఛాయ్‌ని ఒక సిప్ చేస్తే చాలు. అయితే ఇరానీ ఛాయ్ ప్రియులకు చేదు వార్త చెప్పాయి హోటల్స్. ఈ ఇరానీ చాయ్ ధర పెంచాలని హైదరాబాద్‌లోని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించాయి. నేటి నుంచి కప్పుపై రూ.5 పెంచనున్నట్లు తెలిపాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలతో హోటళ్ల మనుగడ సాగని క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దీంతో కప్పు టీ ధర రూ.15 నుంచి 20 రూపాయలకు చేరుకుంది. ఇరానీ చాయ్ పత్తి ధర కిలో రూ. మూడు వందల నుంచి రూ. 500కు చేరుకుంది. నాణ్యమైన పాలతో మాత్రమే సంప్రదాయ ఇరానీ ఛాయ్ చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం నాణ్యమైన పాలు లీటరు రూ. 100కు చేరగా... వాణిజ్య సిలిండర్ ధర కూడా జేబుకి చిల్లు పెడుతోంది. ఈ నేపథ్యంలోపాత ధరలకు ఇరానీ ఛాయ్‌ని విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

కాగా.. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలను కూడా పెంచిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లో రూ.15 పెరిగిన వంట గ్యాస్‌ ధర.. అప్పటి నుంచి నిలకడగా ఉంది. తాజాగా 14 కేజీల సిలిండర్‌పై ధర రూ.50 పెరిగింది. దీంతో తెలంగాణలో వంటగ్యాస్‌ సిలిండర్ ధర రూ.1,002కు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,008కు పెరిగింది. ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెరిగినట్లుగా నిపుణులు చెబుతున్నారు.