హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అధ్యక్షుడితో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్ అమిర్ అబ్దుల్లాహియన్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఓ ఆనకట్ట ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న వ్యక్తులందరూ ప్రాణాలు విడిచారు. ఈ క్రాష్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అసలు ఏం జరిగిందంటే.. ఆదివారం ఉదయం అజర్‌బైజాన్ సమీపంలో ఇరుదేశాలు సంయుక్తంగా నిర్మించిన ఓ ఆనకట్ట ప్రారంభోత్సవానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుసేన్ అమిర్ అబ్దుల్లాహియన్, మరికొంతమంది అధికారులు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని హెలికాప్టర్‌లో తబ్రిజ్ నగరానికి తిరుగు పయనమయ్యారు. అయితే భారీ పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతున్న సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పి జోల్ఫా ప్రాంతంలో నేలను బలంగా తాకింది. దీంతో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
హెలికాప్టర్ గల్లంతైన విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమై వెంటనే పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణ నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మానవరహిత విమానాల ద్వారా ప్రమాద స్థలాన్ని గుర్తించి సోమవారం ఉదయం రెస్క్యూ బందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే హెలికాఫ్టర్‌లో అందరూ చనిపోయినట్లు నిర్థారించుకున్నారు. రైసీ మృతితో ఇరాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
అటు అధ్యక్షుడి మృతిపై ఇరాన్ సుప్రీం అయతుల్లా అలి ఖమేనీ స్పందించారు. దేశంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిదగా వైస్ ప్రెసిడెంట్ ముహమ్మద్ మొఖ్బర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి.
ఇటు ఇరాన్ అధ్యక్షుడి మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్, ఇరాన్ మధ్య మైత్రిని బలపర్చడంలో ఆయన ఎంతో చొరవ చూపించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ఇరాన్‌కి భారత్ కచ్చితంగా అండగా ఉంటుందని ట్వీట్ చేశారు.
కాగా ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన ఇబ్రహీం రైసీ 2021 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. అయితే తన ప్రత్యర్థుల్ని పక్కకు తప్పించి, ఆయన తక్కువ ఓటింగ్‌తో ఈ ఎన్నికల్లో గెలుపొందడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. తాను అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరాన్‌లో ఇస్లామిక్ చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు. తన హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments