Chandrababu: అయోధ్యకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం
Send us your feedback to audioarticles@vaarta.com
యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. జనవరి 22న జరిగే ఈ చారిత్రాత్మక వేడుకకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలిరానున్నారు. తాజాగా ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందించింది. తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
ఈనెల 21వరకు సంప్రదాయ క్రతువులు..
మరోవైపు ఈ వేడుకలకు అయోధ్య అందంగా ముస్తాబైంది. జనవరి 16 నుంచి 21వరకు సంప్రదాయ క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈ క్రతువుల్లో చేసే పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగత, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన దూరంగా ఉన్నారు. అందుకే రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు అనిల్ శర్మ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈనెల 22న జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. గర్భగుడిలోకి మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్, మరో ఇద్దరు ప్రముఖులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
పురాతన నాగర శైలిలో ఆలయ నిర్మాణం..
ఇక ఆలయ నిర్మాణాన్ని పురాతన నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మించారు. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు కలిగి ఉంది. ఇక 'రామ్ లల్లా' విగ్రహం పొడవు 51 అంగుళాలు, 8 అడుగుల ఎత్తు , 3 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకు చెందిన అరుణ్ యోగరాజ్ అనే శిల్పి చెక్కారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు దాదాపు 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి 1,265కిలోల లడ్డూ..
ఇదిలా ఉంటే అయోధ్యకు వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేందుకు హైదరాబాద్‌లో తయారైన 1,265 కిలోల లడ్డూను ఇవ్వనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని శ్రీరామ్ కేటరర్స్ ఈ లడ్డూను తయారు చేసింది. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని శ్రీరామ్ కేటరర్స్ ఎండీ నాగభూషణం రెడ్డి తెలిపారు. ఈ లడ్డూ తయారీని జనవరి 15న ప్రారంభించి ఇవాళ పూర్తి చేశామన్నారు. దీంతో ప్రత్యేక పూజలు అనంతరం రోడ్డు మార్గాన రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో లడ్డూను అయోధ్యకు తీసుకెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com