CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే..

  • IndiaGlitz, [Friday,January 12 2024]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల పాటు ఢిల్లీ, విదేశాల పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఏఐసీసీ సమావేశంలో పాల్గొడంతో పాటు అగ్రనేతలతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సి నిధుల గురించి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. అనంతరం 14వ తేది ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుని నేరుగా స్విట్జర్లాంట్ ఫ్లైట్ ఎక్కనున్నారు. అక్కడి దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు.

ఈనెల 15వ తేది నుంచి 18వ తేది వరకు స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్లనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదాని వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చే అంశాలపై అక్కడ ప్రస్తావిస్తుంటారు.

గత పదేళ్లుగా తెలంగాణ నుంచి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ సదస్సుకు హాజరయ్యేవారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే తోడ్పాటు అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ ఏడాది దావోస్ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు, ఓఎస్డీ తదితరులు దావోస్ హాజరవుతున్నారు. అలాగే అటు నుంచి లండన్‌ కూడా వెళ్లి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. ఈ పర్యటనల అనంతరం తిరిగి ఈనెల 23న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.