బాడీ బిల్డర్ జగదీష్ లాడ్ కరోనాతో మృతి
- IndiaGlitz, [Sunday,May 02 2021]
బాడీ బిల్డర్ల గురించి మాట్లాడగానే మనకు గుర్తొచ్చే పేరు జగదీష్ లాడ్. బాడీ బిల్డింగ్‌లో ఎన్నో టైటిల్స్ గెలుచుకుని మిస్టర్ ఇండియాగా పేరు తెచ్చుకున్న జగదీష్ లాడ్ కరోనాతో కన్నుమూశారు. 34 ఏళ్ల జగదీష్‌కు కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఓ ఆసుపత్రిలో జగదీష్ నాలుగు రోజులపాటు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందాడు. అనంతరం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కండలు తిరిగిన, ఉక్కులాంటి శరీరం కలిగిన జగదీష్ కరోనాతో మృతి చెందడం బాడీ బిల్డర్స్‌లో కలకలం రేపుతోంది.
నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్ పాల్ కరోనాతో మృతి
బరోడాలోని నవీ ముంబైలో జగదీష్ నివసించేవారు. ఆయన గతేడాది జిమ్ సెంటర్‌ను ప్రారంభించారు. జగదీష్ పోటీకి నిలబడితే, పతకం గ్యారెంటీ అని అంతా భావిస్తుంటారు. ఎందుకంటే అతడి వంపులు తిరిగిన కండలు, బాడీ ఆకృతి ముందు మిగిలినవారు తేలిపోతారు. జగదీష్ ఆ ఆకృతి కోసం చాలా కష్టపడ్డారు. ప్రతి ఉదయం లేచి రెండు గంటలు వ్యాయామం... ప్రోటీన్, చికెన్, గుడ్లు మరియు మాంసంతో పాటుగా మంచి ఆహారం రోజువారీ తీసుకునేవారు.
జగదీష్ లాడ్ చిన్న వయస్సు నుంచే బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు సార్లు బంగారు పతకం సాధించారు. మిస్టర్ ఇండియా పోటీలో రెండు బంగారు పతకాలు, అలాగే ముంబైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నారు. ఆయన మరణానికి మహారాష్ట్ర బాడీబిల్డింగ్ అసోసియేషన్, ముంబై అసోసియేషన్ విచారం వ్యక్తం చేశాయి. జగదీష్ లాడ్ మరణించాడన్న విషయం తెలుసుకుని నెటిజన్లు సైతం ఆవేదనకు గురయ్యారు. ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.