పవర్ స్టార్ మెట్రో ప్రయాణం.. ఈ ఆసక్తికర విషయాన్ని గమనించారా?
- IndiaGlitz, [Thursday,November 05 2020]
జనసేన అధ్యక్షులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మొట్టమొదటి సారి మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే. ‘వకీల్ సాబ్’ షూటింగ్ కోసం మాదాపూర్ నుంచి మియాపూర్‌కు పవన్ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. పవర్ స్టార్ పిక్స్‌ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పవన్ మెట్రో ప్రయాణానికి సంబంధించిన పిక్స్‌లో ఒక పిక్.. ఆయన మెట్రో ట్రైన్ నుంచి ఆసక్తిగా బయటకు చూస్తున్న దృశ్యానికి సంబంధించింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆయన అంత ఆసక్తిగా దేనిని చూస్తున్నారో గమనించారా?
పవన్ ఆసక్తికరంగా మెట్రో ట్రైన్ నుంచి చూస్తున్నది తన అన్న మెగాస్టార్ చిరంజీవి నిర్మించిన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను. విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు, చిరు అభిమానులు సంబరపడుతున్నారు. మెగాస్టార్ అంటే పవన్‌కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు తనకు అన్న కాదని.. తండ్రి అని పలు సందర్భాల్లో పవన్ వెల్లడించారు. చిరుకు పవన్ చాలా గొప్ప స్థానం ఇస్తారు. తన అన్నను అంతగా అభిమానించే పవన్ నేడు తన ఆయన నిర్మించిన ఐ అండ్ బ్లడ్ బ్యాంకును అంతే ఆసక్తిగా తిలకించడం ఆకట్టుకుంటోంది. సరదా సరదాగా సాగిన పవన్ మెట్రో ప్రయాణంలో తీసిన ఈ పిక్ మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది.
పవన్ ఒక సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్‌పేట స్టేషన్లో ట్రైన్ మారారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్లో పవన్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాలకు చెందిన పలువురు కూర్చొన్నారు. ముఖ్యంగా పవన్ ద్రాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో ముచ్చటించారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని సత్యనారాయణ చెప్పగానే.. పవన్ నవ్వుతూ.. ‘మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి’ అని అన్నారు.