తెలంగాణలో ఆసక్తికర పరిణామం.. భట్టి ఇంటికి తలసాని..
- IndiaGlitz, [Thursday,September 17 2020]
తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మేయర్ బొంతు రామ్మోహన్ ఇతర అధికారులతో కలిసి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా భట్టి.. తలసానికి సాదర స్వాగతం పలికారు. అసలు విషయంలోకి వెళితే బుధవారం అసెంబ్లీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై వాడీవేడి చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన భట్టి.. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు.
భట్టి సవాల్‌పై మంత్రి తలసాని స్పందించారు. రేపు ఉదయం భట్టి ఇంటికి వెళ్లి.. స్వయంగా ఆయనను వెంటబెట్టుకుని వెళ్లి లక్ష బెడ్ రూం ఇళ్లను దగ్గరుండి చూపిస్తానన్నారు. అన్న మాట ప్రకారమే తలసాని గురువారం ఉదయం భట్టి ఇంటికి మేయర్ సహా ఇతర నేతలు, అధికారులతో కలిసి వెళ్లారు. అనంతరం ఇద్దరూ కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్ల సందర్శనకు ఒకే కారులో వెళ్లడం విశేషం. వీరంతా కలిసి జియాగూడ, కట్టెలమండి. సీసీ నగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లనున్నారు.
రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు కామన్‌గా ఉంటూనే ఉంటాయి. కానీ దానిని సీరియస్‌గా తీసుకోవడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. ప్రతిపక్ష నేత సవాల్‌ను సీరియస్‌గా తీసుకుని తలసాని.. భట్టి ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లనే కాకుండా హైదరాబాద్ అభివృద్ధిని కూడా చూపిస్తామంటూ భట్టిని తలసాని తీసుకెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.