ప్రముఖ నటుడు గొల్లపూడి గురించి ఆసక్తికర విషయాలు

  • IndiaGlitz, [Thursday,December 12 2019]

టాలీవుడ్ ప్రముఖ నటుడు, సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరోవైపు టాలీవుడ్‌లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మారుతీరావు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా, మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రముఖులు కొనియాడుతున్నారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను www.indiaglitz.com మీకోసం అందిస్తోంది.

జననం..విద్యాభ్యాసం:-
గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణంలోనే నివాసమున్నారు. సీబీఎం ఉన్నత పాఠశాల, ఏవీఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బీఎస్సీ చేశారు. ఈయన అన్నపూర్ణ, సుబ్బారావుకి అయిదో కొడుకు. మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై, హైదరాబాదుకు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది.. సంబల్‌పూర్ వెళ్లారు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి.. అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తర్వాత ‘ఇంట్లో రామయ్య వీధి’ లో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు.

పెళ్లి..:-
మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హన్మకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు. మారుతీరావుకు ముగ్గురు మగసంతానం సుబ్బారావు, రామకృష్ణ మరియు శ్రీనివాస్.

గొల్లపూడి ట్రాక్ రికార్డ్..:-
తెలుగు సినిమా రంగంలో మాటల రచయిత, నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగా, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగా, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ ఆయన పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా ‘నంది అవార్డు’తో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

పలు పురస్కారాలు:-
మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

నంది అవార్డులు:-
1963 లో డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా
1965 లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా
1989 లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దానికి ఉత్తమ రచయితగా
1991 లో మాస్టారి కాపురం సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా

పదవులు:-
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశారు. 1958లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు. 2007, సెప్టెంబరు 23 న కృష్ణా జిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలకోపన్యాసకుడుగా వ్యవహరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్-12న చెన్నైలో తుదిశ్వాసవిడిచారు.