హథీరామ్ బాబా గురించి ఇంట్రస్టింగ్ ఇన్ ఫర్మేషన్..
- IndiaGlitz, [Monday,July 11 2016]
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. హథీరామ్ బాబా జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఓం నమో వెంకటేశాయ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాల వలే...ఈ భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ కూడా ఖచ్చితంగా అద్భుత చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాలు ఉన్న హథీరామ్ బాబా గురించి ఇంట్రస్టింగ్ ఇన్ ఫర్మేషన్ మీకోసం...
ఎన్టీఆర్ మూవీలో హథీరామ్ బాబా
ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రంలో హథీరామ్ బాబాగా చిత్తూరు నాగయ్య నటించగా... వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించారు. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో ఎన్టీఆర్, చిత్తూరు నాగయ్య, సావిత్రి, ఎస్.వరలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ భక్తిరస చిత్రానికి పెండ్యాల సంగీత దర్శకత్వం వహించారు.ఈ చిత్రం 9.1.1960న విడుదలైంది. ఈ చిత్రంలో సాక్షాత్తు భగవంతుడైన ఎన్టీఆర్ భక్తుడైన హథీరాం బాబా(నాగయ్య)తో పాచికలు ఆడతారు. బాబా మీద కోపంతో అప్పటి రాజు గారు కొన్నివందల చెరకుగడలు తినమని శిక్షవేసి నాగయ్యను చెరసాలలో బంధిస్తారు. అప్పుడు ఆ భగవంతుడు ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరకు గడలను అన్నిటినీ తినేస్తారు. అప్పుడు అందరూ హథీరామ్ బాబా మహిమను గుర్తిస్తారు.హథీరామ్ బాబా గురించి ఈ సంగతులు మాత్రేమే మనకు ఇప్పటి వరకు తెలుసు.
అసలు..హథీరామ్ బాబా ఎవరు..?
ఉత్తర భారతదేశానికి చెందిన రామనంద సంప్రదాయానికి చెందిన వైష్టవ భక్తుడు హథీరామ్. సుమారు 600 సంవత్సరాల క్రితం తీర్థయాత్రల్లో భాగంగా తిరుమలకు వచ్చాడు. తిరుమలలోని వెంకటేశ్వరస్వామి దివ్యమంగళ విగ్రహానికి ముగ్ధుడై... బాబా ఇష్టదైవం అయిన శ్రీరాముడిని ఆ వెంకన్నలో చూసుకుంటూ తిరుమలలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రతి రోజు స్వామివారిని బాబా పూజించేవాడు. బాబా భక్తికి మెచ్చిన శ్రీవారు స్వయంగా బాబా గృహానికి వెళ్లి ఆయనతో పాచికలు ఆడేవారట. ఒక సందర్భంలో హథీరామ్ బాబా చేతిలో ఆ భగవంతుడే ఓడిపోయారని...బాబా తన భక్తుడు అయినందు వలనే బాబాను గెలిపించడానికే ఆ వెంకటేశ్వర స్వామి ఇలా ఓడిపోయారని ఒక కథ ప్రచారంలో ఉంది.బాబా భక్తికి మెచ్చి ఓడిపోయిన ఆ భగవంతుడు తన గుడికన్నా వంద మీటర్ల ఎత్తులో తన భక్తుడైన హథీరామ్ బాబాను ఉండమన్నాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
భక్తుడు కోసం దిగి వచ్చిన భగవంతుడు
ఇప్పటికీ తిరుమలలో స్వామివారి గుడికి ఆగ్నేయం వైపున బాగా ఎత్తులో హథీరామ్ బాబా మఠం ఉంటుంది. ఈ హథీరామ్ బాబా గురించి అప్పటి తిరుమలలో ప్రజలందరూ చెప్పుకుంటున్న సంగతులు. అప్పటి చంద్రగిరి రాజు అయిన శ్రీగిరిధర రాయులు వారికి తెలుస్తుంది. రాజు గారు బాబా భక్తికి పరీక్ష పెట్టాలనుకుని.... బాబాను చెరసాలలో బంధించి ఆ గది నిండా చెరకు గడలు వేసి తెల్లవారేసరికి వాటిని తినమని ఆదేశించారట. అయితే ఆశ్చర్యంగా ఆ చెరసాల గది నుండి ఏనుగు అరుపులు వినిపించాయట. భటులు తలుపులు తెరచి చూడగా ఒక ఏనుగు ఆ చెరకు గడలను తిన్నట్టుగా కనిపించిందట. బాబాను పరీక్షలో గెలిపించడానికి సాక్షాత్తు ఆ శ్రీవారే రావడంతో రాజుగారు భయంతో వణికిపోయి రాజు గిరిధర రాయల వారు తన తప్పును తెలుసుకుని హథీరామ్ బాబా కాళ్ల మీద పడి క్షమించమని కోరారట. ఆతర్వాత రాజు గారు బాబా భక్తుడుగా మారారని ప్రచారంలో ఉంది.
భగవంతునిలో ఐక్యమైన బాబా
అప్పటి నుంచి హథీరామ్ బాబా తిరుమలలోనే ఉంటూ భక్తుల సేవలో గడిపాడు. బాబా తన చివరి రోజుల్లో శ్రీవారి గుడికి ఉత్తరం వైపున ఉన్న 4 కి.మీ దూరంలో వేణుగోపాలస్వామి వారి గుడిని నిర్మించాడు. ఆ వేణుగోపాలస్వామి వారి గుడిలోనే బాబా తన శేష జీవితాన్ని గడిపారు.హథీరామ్ బాబా సమాథి నేటికి తిరుమలలో ఉన్నది. ఇదే మఠంగా మారింది. ఈ మఠానికి అధిపతులుగా కృష్ణదాస్, మహంత్, అర్జున్ దాస్ లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో లంబాడి గిరిజన తెగకు చెందిన వ్యక్తి అయిన హథీరామ్ బాబా తిరుమలకు వచ్చి ఇక్కడ ఉన్న స్వామి వారి మూలమూర్తి విగ్రహానికి ముగ్ధుడై ఇక్కడే తన జీవితాన్నంతా గడిపి ఆ భగవంతునిలో ఐక్యమయ్యారని నాటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇది క్లుప్తంగా హథీరామ్ బాబా చరిత్ర.
నాడు నాగయ్య - నేడు నాగార్జున
నాడు శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో హథీరామ్ బాబాగా చిత్తూరు నాగయ్య నటించగా...నేడు ఓం నమో వెంకటేశాయ చిత్రంలో హథీరామ్ బాబాగా నాగార్జున నటిస్తుండడం విశేషం. ఈ భక్తిరస చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడుగా నటించి మెప్పించిన నవరస సమ్రాట్ నాగార్జున మళ్లీ భక్తుడుగా నటిస్తుండడంతో ఓం నమో వెంకటేశాయ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి..అంచనాలకు తగ్గట్టు ఓం నమో వెంకటేశాయ అద్భుత చిత్రంగా నిలుస్తుందని ఆశిద్దాం.