Vanga Geetha: పిఠాపురంలో ఆసక్తికర ఘటన.. మెడలో ఎర్ర కండువా.. వంగా గీత ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీద నెలకొంది. దీంతో అక్కడ ఏ చిన్న విషయం జరిగినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా పిఠాపురంలో పోలింగ్ సమయంలో ఓ వ్యక్తి.. ఎర్ర కండువ మెడలో వేసుకుని ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. అయితే అప్పుడే పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైసీపీ అభ్యర్థి వంగా గీత వెంటనే అతని కండువా తీసేయాలని సూచించారు. అయితే ఇది గుడ్డ మాత్రమేనంటూ.. ఆ వ్యక్తి తీసేసేందుకు నిరాకరించాడు.
దీంతో కోపంతో ఊగిపోయిన గీత.. ఎర్ర కండువా తీసేయకపోతే.. తాము కూడా వైసీపీ కండువాలు మెడలో వేసుకుని పోలింగ్ కేంద్రానికి వస్తామని హెచ్చరించారు. అయితే ఇంతలో ఎన్నికల అధికారులు.. పోలింగ్ కేంద్రం లోపల నుంచి బయటకు వచ్చారు. ఆ వ్యక్తి మెడలో ఉన్న కండువాను తీసివేయించి అక్కడి నుంచి బయటకు పంపించివేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే వంగాగీత వార్నింగ్ ఇవ్వడాన్ని వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. జనసైనిక్స్కు ఇచ్చిపడేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై జనసేన సైతం స్పందించింది. "అధికార అహంకారం తగ్గించుకోవాలి వంగా గీత గారూ.. ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు, అది సామాన్య శ్రామికులు చెమట తుడుచుకునే కండువా... దాన్ని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఎరుపు రంగు కండువా చూస్తేనే ఇంత భయం దేనికి? అంతలా కండువా భయపెడుతుందా? వారు దయచేసి ఇలాంటి బెదిరింపులు అడ్డుకోవాలని మనవి" అంటూ ట్వీట్ చేసింది.
కాగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి తరుఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ తరుఫున వంగా గీత పోటీచేస్తున్నారు. ఇరుపార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో పిఠాపురం నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. పవన్ తరపున మెగా హీరోలు, జబర్దస్త్ నటులు, సినీ నటులు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక వంగా గీత తరపున వైసీపీ ముఖ్య నాయకులతో సీఎం జగన్ కూడా ప్రచారం నిర్వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments