పవన్ పర్యటనలో ఆసక్తికర ఘటన.. రాజకీయ వర్గాల్లో చర్చ..
- IndiaGlitz, [Wednesday,December 02 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పవన్ పామర్రు గ్రామంలో పర్యటిస్తుండగా.. మాజీ ఎంపీ, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి తండ్రి కేపీ రెడ్డెయ్య పామర్రు వద్ద పవన్ కల్యాణ్‌ని కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌కు రెడ్డయ్య వివరించారు. రైతుల కష్టాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని రెడ్డయ్య వాపోయారు. తుపాను దెబ్బకి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రభుత్వాలు అంచనాలతో సరి పెట్టడమే తప్ప.. ఆదుకోవడం లేదన్నారు.
నష్టపరిహారం లెక్కలు కూడా సరికాదని రెడ్డయ్య పేర్కొన్నారు. రైతులు ఎకరాకు 60వేలు నష్టపోయారని పవన్‌కు తెలిపారు. ఏం చేద్దామో చెప్పాలని.. రైతులను ఎలా ఆదుకోవాలో చెప్పాలని రెడ్డయ్యను పవన్ అడిగారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకుందామా అని రెడ్డయ్యను పవన్ అడిగారు. వైసీపీ ఎమ్మెల్యే తండ్రి పవన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజానీకం సైతం దీని గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటోంది.
తన కుమారుడు వైసీపీలో ఉండగా.. రెడ్డయ్య వెళ్లి పవన్‌ను కలవడం.. రైతులు పక్షాన నిలవాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి పార్థసారధికి వైసీపీలో సముచిత స్థానం ఉంది. ఒకరకంగా మంత్రి కావాల్సిన వ్యక్తి. కానీ ఆయన తండ్రి వెళ్లి జనసేనానిని కలవడం పట్ల స్థానిక నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రీకొడుకులకు పడదని అందుకే వెళ్లి ఆయన పవన్‌ని కలిశారని ఇప్పటికే ఒక చర్చ అయితే నడుస్తోంది. మొత్తానికి పవన్ పర్యటనలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.