Download App

Intelligent Review

కెరీర్ ప్రారంభంలో  మంచి విజ‌యాల‌ను సాధించిన మెగా యువ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కి గ‌త నాలుగు చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యాన్నే మిగిల్చాయి. ఎలాంటి సినిమాతో స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాలని ఆలోచిస్తున్న ఈ యువ క‌థానాయ‌కుడికి వినాయ‌క్ రూపంలో మంచి సోర్స్ దొరికింది. హీరోల‌కు క‌మ‌ర్షియ‌ల్ హీరోల‌నే ఇమేజ్ ఇప్పించ‌డం ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ప్ర‌త్యేక‌త‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన హీరోల్లో చాలా మందికి కెరీర్ గ్రాఫ్ ట‌ర్న్ అయ్యాయి కూడా. కాబ‌ట్టి సాయిధ‌ర‌మ్ కూడా త‌న‌కు మంచి బ్రేక్ వ‌స్తుంద‌ని చాలా ఆశ ప‌డ్డాడు. మ‌రి సాయిధ‌ర‌మ్ తేజ్ ఆశ ప‌లించిందా?  వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `ఇంటిలిజెంట్‌` ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

తేజు(సాయిధ‌ర‌మ్ తేజ్‌)  చిన్న‌ప్ప‌ట్నుంచి ఏ ప‌నిని రిస్క్ చేయ‌కుండా చేయాల‌నుకునే మ‌న‌స్థత్వం. అలాంటి ప‌రిస్థితులు వ‌స్తే.. ఇంటిలిజెంట్‌గా ఆలోచించి త‌ప్పించుకుంటూ వుంటాడు. స్కూల్ టాపర్ అయిన తేజుని విజ‌న్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ అధినేత నంద‌కిషోర్ (నాజ‌ర్‌) పెంచి పెద్ద చేస్తాడు. తేజు బాగా చ‌దువుకుని నంద‌కిషోర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు. నంద‌కిషోర్ చేసే మంచి ప‌నుల‌కు త‌న వంతు సాయంగా నిలుస్తుంటాడు. కుటుంబం, స్నేహితులు, ప‌నిచేసే ఉద్యోగం ఆలోచ‌న‌ల్లో ఉండే తేజు లైఫ్‌లోకి లావ‌ణ్య త్రిపాఠి ఎంట్రీ ఇస్తుంది. లావ‌ణ్య త‌న బాస్ అమ్మాయ‌ని తెలియ‌క.. స్నేహితుల‌కు స‌హాయం చేయ‌బోయి ఆమె దృష్టిలో చెడ్డ‌వాడుగా పేరు తెచ్చుకుంటాడు తేజు. అయితే త్వ‌ర‌లోనే లావ‌ణ్య‌కి తేజు మంచిత‌నం తెలిసి అత‌న్ని ప్రేమిస్తుంది. నంద‌కిషోర్ త‌న కంపెనీలో వ‌చ్చే లాభాల‌ను త‌న ఉద్యోగుల‌కు, పేద ప్ర‌జ‌ల‌కు, అనాథ‌ల‌కు పంచి పెడుతుంటాడు. ఇది గిట్ట‌నివారు మాఫియా డాన్ విక్కీ భాయ్‌(రాహుల్ దేవ్‌), అత‌ని త‌మ్ముడు (దేవ్‌గిల్) సహాయం కోరుతారు. విక్కీ భాయ్ బ‌ల‌వంతంగా విజ‌న్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ త‌మ సొంతం చేసుకోవాల‌నుకుంటారు. నంద‌కిషోర్ విక్కీ భాయ్ బెదిరింపుల‌కు లొంగ‌డు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని క‌ల‌వాల‌నుకుంటాడు. అయితే ఉన్న‌ట్లుండి నంద‌కిషోర్ కంపెనీని విక్కీ భాయ్‌కి రాసిచ్చేసి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. విష‌యం తెలిసిన తేజు విక్కి భాయ్ త‌మ్ముడిని, గ్యాంగ్‌ను చంపేస్తాడు.దాంతో విక్కీ భాయ్ మ‌లేషియా నుండి హైద‌రాబాద్ వ‌స్తాడు. తేజు, విక్కీ భాయ్ మ‌ద్య పోరు మొద‌ల‌వుతుంది. ఈ పోరులో విక్కీపై తేజు ఎలా గెలుపుసాధిస్తాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

పాజిటివ్ అంశాలు ప‌రిమితంగానే ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. నిర్మాత క‌ల్యాణ్ సినిమా కోసం బాగానే ఖ‌ర్చు పెట్టాడు. ఆ ఖ‌ర్చును విశ్వేశ్వ‌ర్ త‌న కెమెరా వ‌ర్క్‌తో తెర‌పై చూపించారు. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం గొప్ప‌గా ఏమీ లేదు. ఇక న‌టీన‌టులు విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో తేజు త‌ప్ప మ‌రేం క‌న‌ప‌డ‌దు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా క‌థంతా త‌న చుట్టూనే తిరుగుతుంది. మెగా కాంపౌండ్ హీరోగా సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న‌దైన శైలిలో డాన్సులు, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో, న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. లుక్ వైజ్ కూడా కొత్త‌గా, స్ట‌యిలిష్‌గా క‌న‌ప‌డ్డాడు.

మైనస్ పాయింట్స్‌:

హీరోయిన్ ఇక లావ‌ణ్య పాత్ర చాలా ప‌రిమితం. న‌ట‌న‌కు స్కోప్ లేని పాత్ర‌. హీరో హీరోయిన్ క‌లిసేది ఐదారు సంద్భాల్లో అయితే అందులో నాలుగు సాంగ్స్ సంద‌ర్భాలే వ‌స్తాయి. ఇక సినిమాలోని ఇత‌ర పాత్ర‌లన్నీ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనింగ్‌లో హీరో క్యారెక్టరైజేష‌న్‌కు స‌పోర్ట్ చేసేలానే డిజైన్ చేశారు. ఫ‌స్టాఫ్ అంతా హీరో, అత‌ని స్నేహితులు, లావ‌ణ్య‌, పోసాని, జ‌య‌ప్రకాష్ రెడ్డి, విద్యుల్లేఖా రామ‌న్‌, ఫిష్ వెంక‌ట్ పాత్ర‌ల మ‌ధ్య కామెడీ ట్రాక్‌తోనే ఎక్కువ ఆధార‌ప‌డింది. అయితే ఈ ట్రాక్‌లో పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఇక సెకండాఫ్‌లో కూడా పృథ్వీ, కాదంబ‌రి కిర‌ణ్ వంటి ట్రాక్‌తో పాటు బ్ర‌హ్మానందం కామెడీపై ఆధార‌ప‌డ్డారు. ఈ రెండు ట్రాక్‌లు కూడా ప్లాఫ్ అయ్యాయి. ఇక యాక్ష‌న్ ఏపిసోడ్స్ గురించి కొత్త‌గా చెప్పుకునేదేమీ లేదు. వినాయ‌క్ త‌న‌దైన కామెడీని తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం కొత్త‌గా చేయ‌లేదు. క‌థ‌, క‌థ‌నంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం దీనికి క‌లిసొచ్చింది. త‌మ‌న్ ట్యూన్స్ బాలేవు. ఇళ‌యరాజావారు అందించిన చ‌మ‌కు చ‌మ‌కు ... సాంగ్ బానే ఉన్నా... డాన్స్ కంపోజింగ్‌, సాంగ్ పిక్చ‌రైజేష‌న్ బాలేదు.

విశ్లేష‌ణ‌:

సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇంటిలిజెంట్ క‌థ కంటే వినాయ‌క్‌పై ఎక్కువ న‌మ్మ‌కాన్ని పెట్టుకున్నాడు. వినాయ‌క్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడ‌నుకున్నాడు కానీ మ్యాజిక్ వ‌ర్కువ‌ట్ కాలేదు. సాధార‌ణంగా వినాయ‌క్ తెర‌కెక్కించే క‌మ‌ర్షియ‌ల్ సినిమాలంటే నాయ‌క్‌, అదుర్స్ త‌ర‌హా కామెడీ పార్ట్ ఉంటుంద‌ని భావించిన ప్రేకకుల‌కు నిరాశ త‌ప్ప‌దు. బ‌ల‌మైన విల‌నిజం క‌న‌ప‌డుదు. పాత్ర‌లు, వాటి తీరు తెన్నులు, లాజిక్స్ లేకుండా ఉన్నాయి. హీరో రాజ‌కీయ నాయ‌కుల అకౌంట్స్ హ్యాక్ చేస్తాడ‌నుకుందాం. బినామీ అకౌంట్స్ ఉన్న సాఫ్ట్‌వేర్ మ‌రి అంత వీక్‌గా ఉంటాయా? అనిపిస్తుంది. హీరో ఓ ఆశ‌యం కోసం విల‌న్స్‌ను ఫూల్స్ చేయ‌డం.. విల‌న్స్ హీరో ఏం చేస్తున్నాడో తెలియ‌క అత‌ని చుట్టూ తిర‌గ‌డం.. చివ‌ర‌కు హీరో మంచి త‌నం తెలిసిన పోలీసులే అత‌నికి స‌పోర్ట్ చేయ‌డం ఇవ‌న్నీ పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి కథే.

బోట‌మ్ లైన్‌: ఇంటిలిజెంట్‌... ఫెయిలైన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనింగ్ ఫార్ములా

Intelligent Movie Review in English

 

Rating : 2.0 / 5.0