UK ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ నారయణ అల్లుడు!
- IndiaGlitz, [Thursday,February 13 2020]
అవును మీరు వింటున్నది నిజమే.. యునైటెడ్ కింగ్డమ్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ పేరును ఆ దేశ ప్రధాని ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం నాడు ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్ జావిద్ తన పదవికి రాజీనామా చేయడంతో రిషిని కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం రిషి ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. అతిచిన్న వయస్సులోనే ఈయన కీలక శాఖకు మంత్రి పదవిని అధిరోహిస్తుండటంతో ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రిషి గురించి మూడు ముక్కల్లో!
39 ఏళ్ల రిషి ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్ కౌంటీలో జన్మించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదవు పూర్తిచేసుకున్న ఆయన 2009 సంవత్సరంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. యూనివర్శిటి నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ (PPE) చదువుకున్న ఆయన 2014లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015 ఎన్నికల్లోనే ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాదు.. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన్ను ఈసారి కీలక పదవి అయిన ఆర్థిక శాఖ వరించింది. రాజకీయాల్లోకి రాకముందు రిషి సునక్ పలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేసి సత్తా చాటారు. అంతేకాదు.. నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ ఓ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.