సరికొత్త రూపు సంతరించుకోనున్న ఇంద్రకీలాద్రి
- IndiaGlitz, [Wednesday,October 28 2020]
ఇంద్రకీలాద్రి సరికొత్త రూపు సంతరించుకోనుంది. దుర్గమ్మ భక్తులకు మౌలిక వసతులతో పాటు.. అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనికోసం రూ.83 కోట్లతో ప్రణాళిక సిద్ధమవుతోంది. కొండపైన ఆలయం వద్ద ప్రాకారమండపాలతో పాటు, కొండ దిగువన దుర్గాఘాట్ వద్ద మూడు అంతస్థులతో కేశఖండన శాల, కనకదుర్గ నగర్ వైపు ఎంట్రన్స్ ప్లాజా, మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదం పోటును నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ రాకకు కొన్ని గంటల ముందు కొండిచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం ఆరా తీశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొండపై భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు, దేవస్థానం అభివృద్ధికి సీఎం సంకల్పించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు రూ.85 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనిలో భాగంగా.. ఇంద్రకీలాద్రిపై నుంచి కొండ చరియలు విరిగి పడకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన పనులపై ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
కొండపైనున్న శివాలయం భాగాన్ని ఇటీవలే విస్తరించడంతో... సువిశాలమైన వైశాల్యం అందుబాటులోకి వచ్చినందున మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని రాతితో పునర్నిర్మించి, చుట్టూ ప్రాకార మండపాలను నిర్మించాలని దేవస్థానం అధికారులు ప్రతిపాదించారు. వీటన్నింటి నిర్మాణానికి రూ.7.5 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. కొండ దిగువన దుర్గాఘాట్ వద్ద మూడు అంతస్థులతో కేశఖండనశాల నిర్మాణానికి రూ.23 కోట్లతో అంచనాలు రూపొందించారు. కనకదుర్గ నగర్ వైపు ఎంట్రన్స్ ప్లాజాను రూ.9 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. శివాలయం దిగువన మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదం పోటును నిర్మించాలని ప్రతిపాదించారు. భక్తులకు అన్నదానం కూడా ఇక్కడే చేసేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో కూడిన భవనం నిర్మించడానికి రూ. 8.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ పనులన్నింటినీ కూడా ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.