డైరెక్టర్ ఇంద్రగంటి ఇంట విషాదం...
- IndiaGlitz, [Thursday,July 25 2019]
టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట విషాదం నెలకొంది. గేయ కవి, పండితుడు, కథారచయిత, పత్రికా సంపాదకుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (75) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు హైదరాబాద్‌లో అనారోగ్యంతో పరమపదించారు. శర్మ ఇకలేరన్న విషయం తెలుసుకున్న పలువురు రచయితలు, సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపి.. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. కాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు అల్వాల్ స్వర్గధామ్‌లో శర్మ అంత్యక్రియలు జరగనున్నాయి.
శర్మ ట్రాక్ రికార్డ్..
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మే 29 1944 న జన్మించారు. సుప్రసిద్ధకవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఇతని తండ్రి కావడంతో చిన్ననాటి నుంచే సాహిత్య వాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టారు. తెలుగులో ఎంఏ పట్టభద్రుడై ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్‌గా 1969-76 మధ్య పనిచేశారు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధుడు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా శర్మ చేరారు. తెలుగు ప్రసంగాల శాఖకు ఉషశ్రీకి సహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. శర్మ వివిధ పత్రికలలో గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలు రాశారు.
అంతేకాకుండా.. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించారు. రేడియో ప్రసంగాలు చేశారు. 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా నిజామాబాద్ కేంద్రంలో పనిచేశారు. 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు - గోపాలరావు (1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశాడు. కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాల్లో శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోనూ ఓ ఫుల్ రొమాంటిక్ సాంగ్ రాయడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు.
రచనలు..
అనుభూతి గీతాలు (కవితాసంకలనం)
శిలామురళి (వచన కావ్యం)
ఏకాంతకోకిల (ఏకాంత కోకిల)
నిశ్శబ్దగమ్యం (కవితాసంకలనం)
పొగడపూలు (గేయాలు)
తూర్పున వాలిన సూర్యుడు (నవల)
క్షణికం (నవల)
సాహిత్యపరిచయం (సాహిత్యవిమర్శ)
ఆలోచన (సాహిత్యవ్యాసాలు)
శ్రీపాద పారిజాతం (యక్షగానం)
కిరాతార్జునీయం (యక్షగానం)
శ్రీ ఆండాల్ కల్యాణం (యక్షగానం)
గంగావతరణం (యక్షగానం)
ఆకుపచ్చని కోరికలు (నాటకం)
అవతార సమాప్తి (నాటిక)
మహర్షి ప్రస్థానం (నాటిక)
గాథావాహిని