మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌చేసి ఇప్పుడు నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు విజయ్ ఆంటోని. ఆసక్తికరమైన విషయమేమంటే రజనీకాంత్, కమల్‌హాసన్‌లను పక్కన పెడితే తమిళంలో స్టార్ హీరోలైన సూర్య, కార్తి, విక్రమ్‌ల తర్వాత మరే తమిళ హీరోకు రానీ తెలుగు మార్కెట్ రేంజ్‌ను విజయ్ ఆంటోని తన `బిచ్చగాడు` సినిమాతో సొంతం చేసుకున్నాడు. అదే ఊపును మాత్రం తన గత రెండు చిత్రాలు `భేతాళుడు`, `యెమన్`లతో కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే మళ్ళీ సక్సెస్ సాధించి తన పట్టును విడిచిపెట్టకూడదనే అభిప్రాయం విజయ్ ఆంటోనిలో బాగా కనపడుతుంది. అందులోభాగంగా విజయ్ ఆంటోని తెలుగులోకి తన సినిమాలను అనువాదం చేయడమే కాకుండా, ప్రమోషన్స్‌లో చాలా చురుకుగా ఉంటున్నాడు. మరి `ఇంద్రసేన` విషయంలో కూడా విజయ్ ఆంటోని సక్సెస్ దక్కిందా? లేదా? అని తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
కథ:
ఇంద్రసేన, రుద్రసేన కవల పిల్లలు. ఇద్దరూ మంచి మనస్తత్వమున్నవారు. ఇంద్రసేన ప్రేమించి ఎలిజిబెత్ అనే అమ్మాయి ఓ యాక్సిడెంట్‌లో మరణిస్తుంది. దాంతో ఇంద్రసేన ఆమె లోకంగానే ఉంటూ తాగుతూ బ్రతికేస్తుంటాడు. కానీ రుద్రసేన అలా కాకుండా ఓ స్కూల్‌లో పి.ఇ.టి టీచర్‌గా పనిస్తుంటాడు. అన్నదమ్ములకు కూడా ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమున్నప్పటికీ బయటపడరు. తన స్నేహితుడికి సహాయం చేయబోయి ఇంద్రసేన సమస్యల్లో చిక్కుకుంటాడు. చివరకు మావయ్య సహాయంతో బయటపడ్డప్పటికీ అనుకోకుండా ఓ హత్య చేసి ఏడేళ్లు జైలు కెళతాడు. జైలు నుండి వచ్చిన ఇంద్రసేనకు రుద్రసేన ఓ పెద్ద గూండాలా కనపడతాడు. అయితే తన తమ్ముడు అలా మారడానికి ఛైర్మన్ కోటయ్య, ఎమ్మెల్యే(రాధారవి) కారణం అని తెలుసుకుంటాడు. అయితే ఓ సందర్భంలో ఛైర్మన్, ఎమ్మెల్యే కలిసి రుద్రసేనను చంపాలనుకుంటారు. ఓ తప్పుడు కేసులో ఇరికిస్తారు. ఆ సంగతి తెలుసుకున్న ఇంద్రసేన తమ్ముడిని కాపాడటానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తన తమ్ముడినెలా కాపాడుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- విజయ్ ఆంటోని ఎమోషనల్ యాక్టింగ్
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- పాటలు
- సెకండాఫ్
విశ్లేషణ:
విజయ్ ఆంటోని ఇంద్రసేన, రుద్రసేన పాత్రల్లో నటన పరంగా వేరియేషన్ చూపించాడు. తాగుబోతు పాత్రలో ఉంటూనే తమ్ముడిపై, అమ్మ, నాన్నపై ప్రేమను కురిపించే ఇంద్రసేనగా, అన్నపై, కుటుంబంపై ప్రేమతో తన జీవితాన్ని తప్పుదోవలో తిప్పుకునే తమ్ముడు రుద్రసేనగా విజయ్ ఆంటోని నటన బావుంది. ఎమోషనల్ సీన్స్‌లో విజయ్ ఆంటోని నటన మెప్పిస్తుంది. అమ్మాయిని కాపాడే ఇంద్రసేనగా విజయ్ ఆంటోని ఇంట్రడక్షన్ సీన్ మెప్పిస్తుంది. ఇక తమ్ముడి కోసం అన్నగా పడే తపనను తెరపై తన ఎక్స్‌ఫ్రెషన్స్‌తో చక్కగా నటనతో చూపించాడు విజయ్ ఆంటోని. ఇక రొమాంటిక్, లవ్ సీన్స్, సాంగ్స్‌లో మాత్రం విజయ్ ఆంటోని కదలికలు ఏదో ఇబ్బంది పడుతున్నట్లు కనపడ్డాయి. డయానా, మహిమాలు చక్కగా నటించారు. పాత్రలకు తగిన విధంగా న్యాయం చేశారు. ఇద్దరు బొద్దుగానే కనపడ్డారు. ఇక రాధారవి ఇతర సహాయ నటులందరూ తమిళవారు కావడంతో తెలుగు ప్రేక్షకులకు అసలు కనెక్ట్ కాలేరు. పాత్రలు, వాటి తీరు బావున్నా, వాటిలో కాస్త పేరున్న నటీనటులు ఉండుంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యుండేది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ దాని తరువాత వచ్చే క్రమంలో రుద్రసేన రౌడీగా మారడం వెనుక పరిస్థితులు కాస్త నాటకీయంగా అనిపించాయి. రుద్రసేన అసలు గూండాగా ఎందుకు మారుతాడనే విషయం రివీల్ కాగానే కథలోని పట్టు తప్పింది. క్లైమాక్స్ ఎంటనేది ముందుగానే ప్రేక్షకుడు ఊహించేస్తాడు. అయితే క్లైమాక్స్‌కు మొదటి సీన్‌లోని ఓ పాత్రకు లింక్ పెట్టడం అనేది దర్శకుడి ప్రతిభను తెలియజేస్తుంది. క్లైమాక్స్‌లో విజయ్ ఆంటోని లేడీ కానిస్టేబుల్ కాళ్లు పట్టుకోవడం, తమ్ముడి కోసం చేసే త్యాగం కోసం నోరు మెదపకపోవడం అనే సీన్స్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలాన్ని చేకూర్చాయి. అయితే ఓ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని విడుదలైన మరో వ్యక్తిగా మారి..చనిపోయినప్పుడు పోలీసులకు ఆ సీక్రెట్ తెలియకుండా ఉంటుందా? అనేది లాజిక్ లేని తీరుగా కనపడుతుంది.
దర్శకుడు శ్రీనివాస్ సకండాఫ్ కథలోని టెంపోను మిస్ చేశాడనిపించింది. విజయ్ ఆంటోని సంగీతం అందించిన పాటలు విజువల్‌గా బావున్నాయే కానీ, ట్యూన్స్ ఆకట్టుకోవు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. విజయ్ ఆంటోని ఎడిటింగ్ వర్క్ కూడా బావుంది. సినిమా వ్యవథి ఎక్కువగా లేకపోవడం కూడా ప్లస్ పాయింటే. సినిమాటోగ్రాఫర్ దిల్‌రాజు సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాను ఓసారి చూడొచ్చు
బోటమ్ లైన్: 'ఇంద్రసేన' ఎమోషనల్‌గా మెప్పిస్తాడు
Comments