21 ఏళ్ల విరామానికి తెర.. మిస్ యూనివర్స్‌గా భారతీయ యువతి
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం భారతదేశానికి దక్కింది. మిస్ యూనివర్స్ 2021గా హర్నాజ్ కౌర్ సంధు ఎంపికయ్యారు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది . 80 మంది ముద్దుగుమ్మలతో పోటి పడి మరి హర్నాజ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. తద్వారా సుస్మితా సేన్, లారాదత్తా తర్వాత మిస్ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత సంతతి యువతిగా హర్నాజ్ సంధూ రికార్డుల్లోకెక్కారు.
పంజాబ్‌లోని ఛండీగడ్‌లో 2000 మార్చి 3న జన్మించిన హర్నాజ్‌కు చిన్నప్పట్నించి మోడలింగ్, నటన అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. పదిహేడేళ్ల వయసులోనే 2017లో ‘‘మిస్ చండీఘడ్’’గా ఎంపికైంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన హర్నాజ్ .. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ అంటే హర్నాజ్‌కు ఎంతో ఇష్టం. ఇక మోడలింగ్ మీద ఇష్టంతో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఇదే సమయంలో కొన్ని పంజాబీ సినిమాలలో కూడా నటించింది. మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది.
2019లో హర్నాజ్ ‘‘ ఫెమినా మిస్ ఇండియా ’’ టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే 2021లో ప్రతిష్థాత్మకమైన ‘మిస్ దివా 2021’ అవార్డును సైతం అందుకుంది. ఇక తాజాగా ప్రతిష్టాత్మక ‘‘మిస్ యూనివర్స్’’ గా గెలిచిన హర్నాజ్ ఇకపై అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించబోతోంది. అక్కడే ఉండి ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక కార్యక్రమాలకు భారతదేశం తరుపున హాజరవ్వనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments