ఇక చైనా, నేపాల్‌తో పనిలేదు.. ఇండియా నుంచే డైరెక్ట్‌గా మానస సరోవరానికి: నితిన్ గడ్కరీ
Send us your feedback to audioarticles@vaarta.com
హిందువులు జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే ప్రదేశాల్లో మానస సరోవరం కూడా ఒకటి. శివుడు కొలువైయుండే ఈ ప్రాంతాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి సరస్సులో స్నానం చేసి.. కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని కోట్లాది మంది భావిస్తూ వుంటారు. ప్రతిఏటా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి చేరుకునేవారు ఎందరో. అయితే మానస సరోవరాన్ని చేరుకోవాలంటే భారత ప్రభుత్వ అనుమతితో పాటు.. నేపాల్, చైనా దేశాల అనుమతి తప్పనిసరి.
కొన్ని సార్లు ఆయా దేశాలు కఠినంగా వ్యవహరిస్తూ వుండటంతో యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. డిసెంబర్ 2023 నాటికి భారతీయులు.. చైనా , నేపాల్ మీదుగా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే కైలాస మానస సరోవర్‌ని సందర్శించుకోవచ్చన్నారు. ఈ మేరకు మంగళవారం గడ్కరీ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ నుంచి నేరుగా మానసరోవర్‌కు వెళ్లే మార్గాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తద్వారా మానస సరోవరాన్ని చేరుకోవడానికి పట్టే సమయం తగ్గుతుందన్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రమాదకరమైన ట్రెక్కింగ్ మాదిరిగా సాగుతున్న ప్రయాణం ఇకపై నల్లేరు మీద నడకలా సాగుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో తమ మంత్రిత్వ శాఖ రోడ్డు కనెక్టివిటీని పెంచుతోందని, ఇది శ్రీనగర్, ఢిల్లీ లేదా ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు ఖర్చయిందని గడ్కరీ పేర్కొన్నారు.
ఇందుకోసం లడఖ్ నుండి కార్గిల్, కార్గిల్ నుండి జెడ్-మోర్, జెడ్-మోర్ నుండి శ్రీనగర్, శ్రీనగర్ నుండి జమ్మూ వరకు నాలుగు సొరంగాలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే Z-Morh పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉందన్న ఆయన... జోజిలా సొరంగంలో పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 1,000 మంది కార్మికులు విధుల్లో వున్నారని... ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 2024 వరకు గడువు ఇచ్చాం అని గడ్కరీ చెప్పారు.
అంతేకాకుండా దేశంలో టెక్నాలజీ, గ్రీన్ ఫ్యూయల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గే అవకాశం ఉందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో పెట్రోల్‌తో నడిచే వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 2024 డిసెంబర్ నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయన్నారు. ఇన్‌విట్ ద్వారా పేద ప్రజలే రోడ్లను నిర్మించనున్నట్లు గడ్కరీ చెప్పారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com