రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : భారతీయ విద్యార్ధిపై కాల్పులు , ఆసుపత్రికి తరలింపు

  • IndiaGlitz, [Friday,March 04 2022]

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇరుదేశాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ పుతిన్ కానీ, జెలెన్ స్కీ కానీ తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధం భారతీయుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఇప్పటికే ఖార్కివ్‌లో జరిగిన దాడిలో కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది. విదేశీ విద్యార్ధుల తరలింపు విషయంలో సాయం చేయాలని భారత్ సహా పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఈ ఘటన మరిచిపోకముందే .. ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్ధిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి పౌర విమానయాన సహాయ మంత్రి వీకే సింగ్ అధికారికంగా తెలిపారు.

అతనిని పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్జోత్‌ సింగ్‌‌గా గుర్తించారు. బుల్లెట్ గాయం కారణంగా కీవ్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను కళ్లు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు హర్జోత్ వాపోయాడు. ఎల్వివ్‌ వెళ్లేందుకు కీవ్‌లో రైలు ఎక్కేందుకు వెళ్లగా.. తాను అనుమతించలేదని, దీంతో స్నేహితులతో కలిసి క్యాబ్‌ అద్దెకు తీసుకుని బయలు దేరామని ఆయన పేర్కొన్నారు. కీవ్‌ నుండి బయటకు వెళుతుండగా.. క్యాబ్‌పై కాల్పులు జరిపారని, భుజం నుండి బులెట్‌ దూసుకెళ్లిందని ఆ విద్యార్ధి చెప్పారు.

ఎల్వివ్‌కు వెళ్లేందుకు సౌకర్యాలు కల్పించాలని, తమను ఎవరూ సంప్రదించలేదని హర్జోత్ సింగ్ తెలిపారు. తాను ఎల్వివ్‌కు చేరుకునేలా సహకరించాలని రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. తాను వివరాలు పదేపదే చెప్పాల్సి వచ్చిందని, అయినప్పటికీ తన పరిస్థితిని తెలియజేశానని అన్నారు. కానీ అటు నుండి స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.