రష్యా దాడుల్లో భారతీయ వైద్య విద్యార్ధి మృతి.. కర్ణాటకలో విషాదం

  • IndiaGlitz, [Tuesday,March 01 2022]

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. తరలింపు ప్రక్రియ వేగవంతమవుతున్నా పరిస్ధితి దారుణంగా వుండటంతో ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ఉక్రెయిన్ - పోలాండ్ సరిహద్దుల్లో భారతీయ విద్యార్ధులపై పోలీసుల దురుసు ప్రవర్తన, లాఠీచార్జీ వంటివి భారత ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. తరలింపు ప్రక్రియను పరుగులు పెట్టించాలని చూస్తోంది.

ఈ ప్రక్రియ జరుగుతుండగానే ఓ దారుణం జరిగింది. రష్యా దాడుల్లో భారతీయ విద్యార్ధి మృతిచెందాడు. ఈ ఉదయం ఖార్కీవ్‌లో జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విటర్‌లో అధికారికంగా ధ్రువీకరించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. అతను ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

మరోవైపు... ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారతీయ పౌరుల్ని ఉద్దేశించి మంగళవారం కేంద్రం అత్యవసర ప్రకటన చేసింది. తక్షణమే కీవ్ నగరాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయటపడాలని సూచనలు చేసింది. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం వైపునకు చేరుకునేందుకు కీవ్‌లో రైళ్లు సిద్ధంగా ఉన్నాయని నిన్న ఇండియన్ ఎంబసీ సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. రైల్వే స్టేషన్ల వద్దకు భారీగా తరలి రావొచ్చునని.. అయితే భారతీయ పౌరులంతా సంయమనంతో వ్యవహరించాలని పేర్కొంది. దేశం వీడేందుకు తగిన పత్రాలు, నగదు వెంట ఉంచుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.