Vande Bharat Express : త్వరలో బెర్త్‌లు వుండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. స్పీడ్ గంటకు 200 కి.మీ, ప్రత్యేకతలివే

  • IndiaGlitz, [Friday,January 20 2023]

దేశంలోని ప్రధాన నగరాలకు వేగంగా చేరుకోవడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభమై పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 8 గంటల పాటు వందలాది కిలోమీటర్లు కూర్చొని ప్రయాణించడమంటే ప్రజలు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్‌కు బదులుగా బెర్త్‌లు వుండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.

400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల కోసం టెండర్లు :

దీనికి సంబంధించిన వివరాలను రైల్వే వర్గాలు గురువారం తెలిపాయి. బెర్తులు వుండే రైళ్లు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తామని అధికారులు చెప్పారు. ఇవి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు బదులుగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కోసం రైల్వే శాఖ టెండర్లు జారీ చేసింది. జనవరి చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మనదేశానికి చెందిన నాలుగు కంపెనీలతో పాటు , కొన్ని విదేశీ కంపెనీలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను తయారు చేసేందుకు ముందుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

ఉక్కుకు బదులుగా అల్యూమినియంతో బెర్త్‌లు :

ఉక్కుకు బదులు అల్యూమినియంతో వీటిని తయారు చేసి బెర్తులను అమరుస్తారు. తొలి దశలో ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - కోల్‌కతా మార్గాల్లో 200 కిలోమీటర్ల వేగంతో వీటిని నడుపుతారు. పశువులు, ఇతర జంతువులు ట్రాక్ మీదకు రాకుండా కంచె వేసే పనులు కూడా నిర్వహిస్తామని రైల్వే శాఖ చెబుతోంది. అంతేకాకుండా.. ఈ రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా రూ.1800 కోట్లతో సాంకేతిక ఏర్పాట్లను చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్ :

ఇకపోతే.. జనవరి 15న ప్రారంభమైన సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ విషయానికి వస్తే వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ బండి నడుస్తుంది. విశాఖ నుంచి బయల్దేరే సమయంలో ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. రైలులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు వుంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు.