Asian Games:ఆసియా క్రీడల్లో దుమ్మురేపుతున్న భారత ఆటగాళ్లు.. క్రికెట్, బ్యాడ్మింటన్‌, కబడ్డీలో స్వర్ణాలు

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఈవెంట్ ఏదైనా సరే మెడలే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే 100 పతకాలు కొట్టిన భారత్ ఖాతాలో తాజాగా మరో మూడు పతకాలు చేరాయి. మూడు కూడా బంగారు పతకాలే కావడం విశేషం. క్రికెట్ విభాగంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వడంతో భారత్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా టాస్ గెలిచిన రుతురాజ్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టును భారత బౌలర్లు తొలి నుంచి కట్టుదిట్టం చేశారు.

ర్యాంకుల పరంగా మెరుగ్గా భారత్..

18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన తరుణంలో మరోసారి భారీ వర్షం పడడంతో మ్యాచ్‌ రద్దయింది. అఫ్గాన్‌ కంటే ర్యాంకుల పరంగా ముందున్న భారత్‌ను విజేతగా ప్రకటించడంతో పసిడి పతకం వరించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఆ తర్వాత సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా బంగారు పతకం సొంతం చేసుకుంది.

బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో స్వర్ణం..

మరోవైపు బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ తొలిసారిగా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. డబుల్స్‌ ఫైనల్లో తెలుగు తేజం సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జంట కొరియా ఆటగాళ్లు చో సోల్గూ, కిమ్ వోంగూపై 21-18, 21-16 తేడాతో అద్భుతంగా ఆడి విజయం సాధించారు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 41 ఏళ్ల తర్వాత హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి కాంస్య పతకం గెలిచాడు. 1965 ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా భారత్‌కు స్వర్ణం తెచ్చాడు. 1971లో దీపు ఘోష్, రామన్ ఘోష్ జంట డబుల్స్ విభాగం కాంస్య పతకం సాధించారు.

పురుషుల కబడ్డీలో గోల్డ్ మెడల్..

ఇక పురుషుల కబడ్డీ విభాగంలో ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత జట్టు బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇరాన్‌ను 33-29 తేడాతో భారత్‌ మట్టికరిపించింది. అంతకుముందు భారత మహిళల జట్టు కూడా కబడ్డీలో స్వర్ణ పతకం సాధించింది. మొత్తానికి ఈసారి ఆసియా క్రీడల్లో మాత్రం భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు.