శిరీష బండ్ల స్పేస్ సూట్ పై ఇండియన్ ఫ్లాగ్.. అతడికి కూడా ఇండియాతో..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు వనిత శిరీష బండ్ల చరిత్ర సృష్టించింది. విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మూడో భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు కల్పన చావ్లా, సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్లారు. ఆదివారం రోజు శిరీష దిగ్విజయంగా అంతరిక్షయానం పూర్తి చేసింది. దీనితో ఇండియా నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి శిరీషకు ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
అమెరికాకు చెందిన 'వర్జిన్ గెలాక్టిక్' అంతరిక్ష సంస్థ ద్వారా శిరీషతో పాటు ఆరుగురు వ్యోమగాములు ఈ మిషన్ లో పాల్గొన్నారు. వి ఎస్ ఎస్ యూనిటీ 22 అనే వ్యోమ నౌక ద్వారా ఈ బృందం స్పేస్ లోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శిరీష బండ్ల తన తల్లిదండ్రులతో కలసి అమెరికాలో స్థిరపడింది. వ్యోమగామిగా అంతరిక్షంలో ప్రయాణించాలని తన చిన్ననాటి కలని శిరీష సాకారం చేసుకుంది.
వర్జిన్ గెలాక్టిక్ అధినేత 70 ఏళ్ల రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఈ యాత్రలో పాల్గొనడం విశేషం. 70 ఏళ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ వ్యోమగామిగా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో జాన్ గ్లేన్ 77 ఏళ్ల వయసులో అంతరిక్షయానం చేశారు.
అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలో వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన ఈ ప్రయోగం సరికొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. సాధారణంగా అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు రాకెట్ ని ఉపయోగిస్తారు. కానీ వర్జిన్ గెలాక్టిక్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం ద్వారా విఎస్ఎస్ యూనిటీ 22ని ప్రయోగించింది.
విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత 15 వేల మీటర్ల ఎత్తులో ఈవ్ నుంచి యూనిటీ విడిపోయింది. అప్పటి నుంచి యూనిటీ ఇంజన్ మొదలయింది. దీనితో వ్యోమనౌక వేగం గంటకు 4 వేల కిమీ పెరిగింది. వ్యోమ నౌక ద్వారా వ్యోమగాములు భూమి నుంచి 88 కిమీ ఎత్తుకు చేరుకున్నారు. నాసా నిబంధలు ప్రకారం 80 కిమీ ఎత్తు దాటితే అంతరిక్షంలోకి ప్రవేశించినట్లే.
దాదాపు 5 నిమిషాల పాటు వ్యోమగాములు బరువు కోల్పోయి భారరహిత స్థితికి గురయ్యారు. వ్యోమనౌక కిటికీల నుంచి భూమిని వీక్షించి అద్భుతమైన అనుభూతికి లోనయ్యారు. తెలుగు తేజం శిరీష బండ్ల తన స్పేస్ సూట్ పై ఇండియన్ ఫ్లాగ్ ని ధరించింది. తద్వారా మాతృ దేశంపై ప్రేమని చాటుకుంది.
యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత భూమిపైకి వచ్చిన వ్యోమగాములు సంబరాలు చేసుకున్నారు. బ్రాన్సన్.. శిరీష బండ్లని తన భుజాలపై ఎక్కించుకుని సంబరాలు చేశారు. పలువురు ప్రముఖులు ఈ ప్రయోగాన్ని వీక్షించారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ప్రయోగాన్ని వీక్షించడం విశేషం.
మరో విశేషం ఏంటంటే బ్రాన్సన్ కి కూడా ఇండియా మూలాలు ఉన్నాయి. అతడి ముత్తాతలలో ఒకరి భార్య భారతీయ మహిళ. ఈ విషయాన్ని బ్రాన్సన్ గతంలోనే తెలిపారు. తన శరీరంలో ఇండియా జన్యువులు ఉన్నాయని తెలిపారు. ఇండియాపై తనకు ప్రత్యేక అభిమానం అని గతంలో బ్రాన్సన్ గుర్తు చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout