భారత్‌లో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ‘ఎక్స్ఈ’... ముంబైలో తొలి కేసు, కేంద్రం అలర్ట్
- IndiaGlitz, [Wednesday,April 06 2022]
2019 చివరిలో చైనాలో వెలుగుచూసిన కోవిడ్ మహమ్మారి భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతూనే వుంది. తాజాగా ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూరప్ , చైనా సహా కొన్ని దేశాల్లో ఈ వేరియంట్ కలకలం రేపుతోంది. తాజాగా ఈ మహమ్మారి భారత్‌లోనూ ప్రవేశించింది. ముంబయిలో తొలి కేసు నమోదైనట్లు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే, ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుల్లో ఇప్పటివరకు తీవ్ర లక్షణాలేవీ లేవని బీఎంసీ వెల్లడించింది.
సాధారణ కొవిడ్ పరీక్షల్లో భాగంగా ముంబయికి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాగా.. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్‌ఈ బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 230 మందిలో 21 మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా, వీరిలో ఎవరికీ వెంటిలేటర్ అవసరం రాలేదని చెప్పారు.
మరోవైపు.. ఒమిక్రాన్ ఉపరకాలైన బీఏ.1, బీఏ.2 ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ ‘‘ఎక్స్ఈ వేరియంట్’’, అధిక సంక్రమణ శక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే దాదాపు 10 శాతం వేగంగా వ్యాపించే గుణం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ మహమ్మారి భారత్‌లో అడుగుపెట్టడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.