భారత్ పెద్ద మనసు: ఎట్టకేలకు అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్..
- IndiaGlitz, [Tuesday,April 07 2020]
అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. భారత్ పెద్ద మనసు చేసుకుని ఎట్టకేలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతికి అంగీకరించింది. కాగా ఇప్పటికే అమెరికాతో పాటు అవసరమైన ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు ఆంక్షల్ని విదేశాంగశాఖ ఎత్తివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. ఇకపై ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు ప్రస్తుత పరిస్థితికి అవసరమైన అన్ని ఔషధాల్ని సైతం భారత్ ఎగుమతి చేయబోతోంది.
అసలేం జరిగింది..!?
ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి.. ‘మీ దగ్గర పెద్దఎత్తున ఉత్పత్తి అవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను మేం దిగుమతి చేసుకుంటాం ఇవ్వండి’ అని కోరగా ట్రంప్‌కు గట్టి ఝలక్ ఇచ్చారు. ఇవ్వడానికి వీలుకాదని చెప్పేశారట. ఫోన్ చేసిన చేసిన రోజే ఏ మాత్రం ఆలోచించకుండానే మోదీ ఈ మాట చెప్పేశారు. అయితే.. అంతకుమందే ఒకరితో ఒకరు మంచిగానే మాట్లాడుకున్నారు కూడా. నిజంగా భారత్ నుంచి ఇలాంటి రియాక్షన్ ఉంటుందని బహుశా ట్రంప్ ఊహించి ఉండడేమో. అమెరికాతో మంచిగా ఉంటూనే మోదీ ఇలా ఊహించని షాకివ్వడం గమనార్హం అని పలువురు నిపుణులు చెబుతున్నారు.
అప్పుడు షాక్ ఇందుకే..
ప్రస్తుతం మనదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయ్. దీంతో మనకు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరం చాలానే ఉంది. ఈ క్రమంలో ఇస్తానని మాట చెప్పి.. ఇవ్వకుండా ఎగ్గొట్టడం సబబు కాదని.. ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పేశారన్న మాట. వాస్తవానికి కరోనా రోగులకు న్యూయార్క్‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో ఇతర మందులు కలిపి వాడగా మెరుగైన ఫలితాలు లభించడంతో ఇండియా నుంచి దిగుమతి చేసుకోవచ్చని ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఒకే ఒక్క మాటతో ట్రంప్ ఆశలన్నీ మోదీ ఆవిరిచేసేశారు. కాగా.. ఇండియాలో ఐదువేలకు చేరువలో కరోనా కేసులు ఉండగా.. 328 మంది కోలుకుంటున్నారు. ఇప్పటి వరకూ 118 మంది మరణించారు. అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల కరోనా రోగులు కోలుకుంటున్నారు.
‘గేమ్ చేంజర్’ కోసం రివెంజ్..
కరోనాపై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ట్రంప్ ‘గేమ్ చేంజర్’గా పలుమార్లు అభివర్ణించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు చేస్తున్న ట్రయల్స్ వర్కవుట్ అయితే ‘స్వర్గం నుంచి అందిన బహుమతి’గా భావిస్తానని కూడా చెప్పారు. ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగానికి 29 మిలియన్ డోస్‌లను నిల్వ చేసి పెట్టుకున్న అమెరికా.. మరింత సేకరించాలని ఇండియాను సంప్రదించగా.. మోదీ ఊహించని షాకిచ్చారు. ఈ క్రమంలో భారత్‌పై రివెంజ్ తీర్చుకోవడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని సరఫరా చేయొద్దన్నదే మోదీ నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. అమెరికాతో భారత్ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందన్నారు. ‘క్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై భారత్ నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం కానీ దానికి ప్రతీకారం ఉండొచ్చు..ఎందుకు ఉండకూడదు?’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.