రష్యాకు 50 వేల కేసుల దూరంలో భారత్
- IndiaGlitz, [Thursday,July 02 2020]
కరోనా మహమ్మారి గత కొద్ది రోజులుగా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. లాక్డౌన్ సడలింపుల అనంతరం దేశ వ్యాప్తంగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 6 లక్షలు దాటగా.. రష్యాకు 50 వేల కేసుల దూరంలో మాత్రమే భారత్ ఉంది. కరోనా కేసుల పరంగా చూస్తే.. 26 లక్షలకు పైగా కేసులతో అమెరికా ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండగా.. 14 లక్షల కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది.
6 లక్షల 54 వేల కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది. ఇండియాలో మరో 50 వేల కేసులు నమోదైతే రష్యాను దాటివేసి మూడో స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, డిల్లీ, తమిళనాడు, యూపీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల నుంచే నమోదు కావడం గమనార్హం. ఈ రాష్ట్రాల్లో మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.