భారత్ పర్యటనలో ట్రంప్ అనుకున్నట్లే జరిగిందిగా!
- IndiaGlitz, [Monday,February 24 2020]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో కాలుమోపిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్‌కు అత్యంత ఘనమైన స్వాగతం లభించింది. అక్కడ్నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాన్వాయ్ ప్రయాణిస్తుండగా రోడ్డుకిరువైపులా లక్షలాది మంది నిల్చుని ట్రంప్‌కు ఆహ్వాన వచనాలు పలికారు. ఈ దృశ్యాన్ని చూసి ట్రంప్ సహాయకుడు డాన్ స్కావినో జూనియర్ విస్మయానికి గురయ్యారు. ‘వావ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ‘నమస్తే ట్రంప్’ కు ఇంతటి విశేషాదరణా! అంటూ ట్వీట్‌తో అందర్నీ ఆశ్చర్యపోయారు.
అనుకున్నది ఇదీ..!
ఇదిలా ఉంటే.. వాస్తవానికి ట్రంప్ కొన్నిరోజులుగా తనకు భారత్‌లో నమ్మశక్యం కాని రీతిలో స్వాగతం లభిస్తుందని అంచనాలు వేసిన విషయం విదితమే. సుమారు కోటి మందికి పైగా ప్రజలు తనకు ఘన స్వాగతం పలుకుతారని అనుకున్నారు. అంతేకాదు తన మనసులోని మాటను ప్రకటన రూపంలోనూ చేశారు. అయితే ఈయన మాటలకు కొందరు సెటైర్లేయగా.. మరికొందరు చిత్ర విచిత్రాలుగా మాట్లాడారు. అంతేకాదు.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లాంటి వారు కూడా ఈ ట్వీట్‌పై హాస్యస్పాదమాడారు.
అయినది ఇదీ..!
ఇప్పుడాయన అంచనాలకు మించినట్లే ఆయనకుస్వాగతం పలికారు. దీంతో ట్రంప్ వావ్ అంటూ ఆశ్చర్యయానికి గురయ్యారు. మరోవైపు ఆయన సహాయక బృందం కూడా సంతోషం పట్టలేకపోతోంది. ట్రంప్ ఫ్లైట్ దిగింది మొదలుకుని సబర్మతి ఆశ్రమం వీక్షణ, మెతెరా స్టేడియం చేరిక వరకూ ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో చుట్టూరా జనం.. మధ్యలో నుంచి ట్రంప్ మాట్లాడటాన్ని చూసిన భార్య మెలానియా ఆనందంతో మునిగి తేలారు. సో.. ట్రంప్ అనుకున్నది కంటే గ్రాండ్‌గానే ఆయన పర్యటన జరుగుతోందని చెప్పుకోవచ్చు.