ఆ అభ్యర్థి హామీలు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ హీట్‌ను రోజురోజుకూ మరింత పెంచుతున్నాయి. ఇక్కడ నుంచి ఎన్ని పార్టీలు పోటీ చేసినప్పటికీ ముఖ్యంగా వార్ మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే జరగనుంది. పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్నికల హామీలైతే మామూలుగా లేవు. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలి.. ఓటర్లను ఆకర్షించాలనే లక్ష్యంతో హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ అభ్యర్థి హామీలకు ఆకాశం కూడా హద్దు కాకపోవడం విశేషం. ఆ అభ్యర్థి హామీలు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ కావడంతో దేశం దృష్టి ఆయనపై పడింది.

తాజాగా తమిళనాడు ఎన్నికల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సంచలన హామీలు ఇచ్చారు. దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన శరవణన్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గ ప్రజలని చంద్రమండలం మీదకు తీసుకు వెళతానని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు నివ్వెరబోతున్నారు. ఇళ్ళలో ఆడవాళ్ళ పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ సాధ్యం కాని హామీలన్నీ ప్రజల దృష్టికి ఆకర్షించడానికేనని తెలుస్తోంది. మొత్తానికి కారణమేదైనా ఆయన మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. శరవణన్ ఇచ్చిన హామీలు చూసి రాజకీయ నేతలు సైతం నివ్వెరబోతున్నారు.

శరవణన్ హామీలు...

నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం పైకి బ్యాచ్‌ల వారీగా తరలింపు

నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు

ఇళ్లల్లో ఆడవాళ్లు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ

ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ

ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండ నిర్మాణం

ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం

నియోజక వర్గ ప్రజలందరికీ ఐఫోన్