Women Cricketers:మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్ హెడ్‌కోచ్‌పై వేటు

  • IndiaGlitz, [Friday,February 16 2024]

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే హెచ్‌సీఏ తాజాగా మహిళల క్రికెటర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో హెడ్‌ కోచ్‌పై వేటు పడింది. అసలు ఏం జరిగిందంటే.. మహిళల క్రికెట్ జట్టు మ్యాచ్‌ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ మ్యాచ్ ఆడిన అనంతరం విమానంలో తిరిగి హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే హెడ్ కోచ్‌ జైసింహా కావాలనే ఆలస్యం చేయడంతో విమానం మిస్ అయిందని మహిళా క్రికెటర్లు చెబుతున్నారు. దీంతో బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరామని.. తమ ముందే ఆయన మద్యం సేవించాడని వాపోతున్నారు. అంతేకాకుండా తాగొద్దని చెప్పినందుకు తమను పచ్చి బూతులు తిట్టాడంటూ ఆరోపిస్తున్నారు.

ఆయన మద్యం తాగుతూ బూతులు తిడుతున్న సమయంలో సెల‌క్షన్ క‌మిటీ మెంబ‌ర్ పూర్ణిమ‌రావు బ‌స్‌లోనే ఉన్నారని.. అడ్డుకోకుండా ఇంకా ఎంకరేజ్ చేశారని పేర్కొన్నారు. దీంతో ఈ ఘ‌ట‌న‌పై మ‌హిళా క్రికెట‌ర్లు హెచ్‌సీఏలో ఫిర్యాదు చేశారు. దీంతో టీమ్ నుంచి త‌ప్పిస్తామంటూ ప్లేయ‌ర్లను కోచ్ బెదిరిస్తున్నట్లు వారు తెలిపారు. జైసింహా, సెలక్షన్ కమిటీ మెంబర్స్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. అయితే ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్నా బోర్డు స్పందించం లేదని వారు మండిపడుతున్నారు.

దీంతో ఎట్టకేలకు ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్‌ మోహన్ రావు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. హెడ్‌ కోచ్‌గా ఉన్న జైసింహను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలని కోరుతూ విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీ రిపోర్టు వచ్చే వరకు తప్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం హెడ్ కోచ్ వ్యవహారం భారత మహిళల క్రికెట్‌లో సంచలనం రేపుతోంది. మరోసారి మహిళ క్రికెటర్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల జట్టుకు హెడ్ కోచ్ నుంచి సిబ్బంది దాకా మహిళలనే నియమించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.