తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయ్!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడినట్లే అని గత వారం రోజులుగా అనిపించినప్పటికీ.. రెండు మూడ్రోజులుగా కేసులను బట్టి చూస్తే మళ్లీ విజృంభిస్తోందని చెప్పుకోవచ్చు. మూడ్రోజుల క్రితం వరకూ సింగిల్ డిజిట్‌లో నమోదైన కేసులు నిన్నట్నుంచి ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయ్. ఇప్పుడు డబుల్ డిజిట్స్‌లో కేసుల సంఖ్య నమోదవుతోంది. మొన్న అనగా మే-01న కేవలం ఆరంటే ఆరే కేసులు నమోదయ్యాయి. కానీ శనివారం రోజు మాత్రం ఒక్కసారిగా అందుకు ట్రిబుల్ అనగా.. 17 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు మాత్రం ఏకంగా 21 కేసులు నమోదయ్యాయి. ఈ 21 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1082కు చేరుకుంది. దీంతో ప్రజల్లో మళ్లీ భయాందోళన కలుగుతోంది.
ఆందోళన కలిగించే విషయమిది..
ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇవాళ నమోదైన 21 కేసుల్లో 20 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం. మిగిలిన ఆ ఒక్క కేసు జగిత్యాల జిల్లాలో నమోదైంది. తగ్గినట్లే తగ్గి కేసులు పెరిగిపోతుండటంతో భాగ్యనగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారినపడి 29 మంది కన్నుమూసినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది. అయితే.. ఇవాళ 46 మంది కరోనా జయించి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ మొత్తం 545 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. ఇప్పటివరకు తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్కరికీ కరోనా నిర్ధారణ కాకపోవడం కాసింత ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు.
వనస్థలిపురంలో పరిస్థితి ఇదీ..
నగరంలోని వనస్థలిపురంలో మూడు కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. ఇప్పటి వరకూ 9 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా కేసులు ఎక్కువవ్వడంతో 8 కాలనీలను కంటైన్‌మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. కంటైన్‌మెంట్ జోన్లలో సోమవారం నుంచి వారం రోజుల పాటు రాకపోకలు పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ 8 కాలనీల పరిసరాల్లో కఠిన అంక్షలు అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం వనస్థలిపురంలో మొత్తం 169 కుటుంబాలు హోం క్వారంటైన్‌లో ఉన్నాయని అధికారులు మీడియాకు వెల్లడించారు. వనస్థలిపురం హుడాసాయినగర్, సుష్మాసాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయ నగర్, ఎస్‌కేడీ నగర్, రైతుబజార్-సాహెబ్‌నగర్ రహదారిని కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించామని అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments