YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిలకు భద్రత పెంచిన పోలీసులు
- IndiaGlitz, [Friday,February 09 2024]
ఎట్టకేలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు పోలీసులు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూకి పెంచామని చెప్పారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రతను పెంచామన్నారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇస్తే వారికి భద్రత కల్పిస్తామని ఆయన వెల్లడించారు.
కాగా తన భద్రతపై సీఎం జగన్ టార్గె్‌ట్‌గా షర్మిల తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేమీ పట్టనట్లు, ఒక మహిళ అని కూడా చూడకుండా, ఓ పార్టీకి అధ్యక్షురాలిని అని కూడా పట్టించుకోకుండా.. ఇవాళ మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే.. మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ఇది ప్రజాస్వామ్యం అన్న ఆలోచన ఉందా? గుర్తుందా? అని ప్రశ్నించారు.
మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే.. మా చెడు కోరుకుంటున్నారు అనే కదా దాని అర్థం. మాకు ఏదైనా ప్రమాదం జరగాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కలిపించే వాళ్లలో కూడా మీ వాళ్లు ఉంటారనే కదా అర్థం. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అంటూ మండిపడ్డారు. దీంతో షర్మిల అభ్యర్థన మేరకు ఆమెకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు షర్మిల జిల్లాల పర్యటన చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ, బహిరంగసభలు నిర్వహిస్తున్న ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. బుధవారం రాత్రి బాపట్లలో జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. ప్రస్తుతం విడుదల చేసింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని.. కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.