Chandrababu Naidu:చంద్రబాబుపై ఐటీ 'ఐ' : అమరావతిలో నిర్మాణాలు, షెల్ కంపెనీలతో కోట్లు జేబులోకి.. రట్టు చేసిన సీబీఐ

  • IndiaGlitz, [Friday,September 01 2023]

దొంగ దొరికే వరకు దొరేనంటారు. అలాగే ఏ వ్యక్తి చేసిన నేరానికైనా శిక్ష పడాలంటే పాపం పండాలంటారు. పెద్దలు అలా ఎందుకంటారో కానీ కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కోర్టు కేసులను ఎదుర్కొన్నారు. అరెస్ట్ అవుతారనుకున్న దశలో తృటిలో తప్పించుకుని ప్రత్యర్ధులకు షాకిచ్చేవారు. వ్యవస్థలను మేనేజ్ చేశారని అన్నా, ఫలానా అన్నా ఆయన చాతుర్యాన్ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే. తాజాగా చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇవ్వడం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఆయన రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా సంస్థ హిందుస్తాన్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబు నాయుడు వందల కోట్ల అవినీతి పాల్పడినట్లుగా ఐటీ శాఖ నోటీసుల్లో తెలిపింది.

ఆగస్ట్ 4న చంద్రబాబుకు ఐటీ నోటీసులు :

టీడీపీ చీఫ్ అభ్యంతరాలను తిరస్కరించిన మీదట.. ఆగస్ట్ 4న హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను శాఖ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153సీ కింద ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సదరు నోటీసుల్లో ఆ మొత్తాన్ని బహిర్గతం కానీ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ఆరా తీసిందట. ఇదంతా కూడా చంద్రబాబు నవ్యాంధ్రకు సీఎంగా వున్నప్పుడు జరిగిందని పేర్కొంది. సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం, భవన నిర్మాణాల్లో గుత్తేదారులను బెదిరించారని.. బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో అవినీతికి పాల్పడినట్లుగా ఐటీ శాఖ ఆరోపిస్తోంది.

హిందూస్థాన్ టైమ్స్ ఏం చెప్పిందంటే:

2019లో ఐటీ శాఖ అధికారులు ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి చెందిన మనోజ్ వాసుదేవ్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్థ చంద్రబాబు హయాంలో కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ తాత్కాలిక భవనాలతో పాటు రాజధాని ప్రాంతంలో ఇతర నిర్మాణ పనులను చేపట్టింది. వీటి విలువ రూ.8 వేల కోట్ల పైనే. ఈ పనులకు సంబంధించి చంద్రబాబు కమీషన్లు పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు గాను.. బాబు .. శ్రీనివాస్ ను రంగంలోకి దింపారు. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్‌కు శ్రీనివాస్ పరిచయం చేశారు. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వీరి నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ .. మనోజ్‌తో చెప్పారట.

చంద్రబాబు పీఏ నివాసంలో ఐటీ సోదాలు :

ఈ సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇక్కడ కూడా ఐటీ అధికారులకు కీలక ఆధారాలు దొరడంతో రెండు చోట్లా లభించిన సమాచారం ఆధారంగా ఐటీ శాఖ నివేదికను తయారు చేసిందట. అనంతరం కొందరు వ్యక్తులను విచారించి అదనపు సమాచారాన్ని, వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. వీటి ఆధారంగానే ఐటీ శాఖ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపినట్లుగా సమాచారం.

షెల్ కంపెనీలు సృష్టించారిలా:

ఐటీ శాఖ విచారణలో కమీషన్లు, నిర్మాణ కాంట్రాక్టులకు సంబంధించిన ఆరోపణలు వాస్తవమేనని పీఏ శ్రీనివాస్ అంగీకరించి సంతకాలు చేశారట. శ్రీనివాస్‌తో పాటు రఘు మరికొందరిని కూడా ఐటీ శాఖ అధికారులు ప్రశ్నించారు. వీరు కూడా నిజమేనని అంగీకరించి పత్రాలపై సంతకాలు చేశారు. అంతేకాదు.. ఈ లావాదేవీలకు సంబంధించి షాపూర్‌జీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఒక కోడ్ భాషలో తన ఈ మెయిల్ ఐడీ సమాచారాన్ని మెయిల్ చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. అందులో ఎవరెవరికి ఎంతెంత ముట్టజెప్పింది ‘‘టన్ను’’ అనే పేరుతో పేర్కొన్నట్లుగా పూర్తి వివరాలు పొందుపరిచారు. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబైకి 3.5 టన్నులు అని అందులో రాసుకున్నారట.

చంద్రబాబు స్టెప్ ఏంటో:

చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చిన వార్త జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. ఎన్నికలకు ముందు ఈ ఘటన అధికార వైసీపీకి ఆయుధంగా మారే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు. నోటీసులు ఇచ్చింది నిజమో కాదో ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి వుంది. అంతేకాదు.. నోటీసులు ఇచ్చినా ఎలా దొరక్కుండా వుండాలో చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య. మరి ఆయనను చట్టం ముందు నిలబెట్టడానికి ఐటీ శాఖ ఎలాంటి ఆధారాలు సంపాదించిందో వేచి చూడాలి.