BiggBoss: ‘‘చోటు’’ అంటూ శ్రీహాన్ బర్త్ డే చేసిన ఇనయా.... కొట్టుకున్న కంటెస్టెంట్స్

  • IndiaGlitz, [Friday,October 21 2022]

ఆశించినమేర కంటెంట్ ఇస్తుండకపోవడంతో కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ మండిపడిన సంగతి తెలిసిందే. ఇష్టం లేకపోతే హౌస్‌ను వీడి వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు.. రెండ్రోజుల నుంచి గేమ్ బిగ్‌బాస్ ఆడుతున్నట్లుగానే వుంది. కడుపు మాడితేనైనా ఇంటి సభ్యులు మారుతారనే ఉద్దేశంతో పోరాడితేనే ఫుడ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇది కొంచెం పర్లేదు. ఈ రోజు మాత్రం ఇంట్లో వుండటానికి కావాల్సిన అర్హత తమకు వుందని నిరూపించుకోవాలని కంటెస్టెంట్స్‌కు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.

దీనిలో భాగంగా మెయిన్ డోర్‌కి వున్న చిన్న గ్యాప్ ద్వారా పువ్వులు, బొమ్మలు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులు వాటిని తీసుకుని దూరంగా వున్న మట్టిలో పాతిపెట్టాలి. ఇందుకోసం కంటెస్టెంట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టాడు. ఒకటి బ్లూటీమ్, రెండోది రెడ్ టీమ్. బ్లూటీమ్‌కు శ్రీసత్య, రెడ్ టీమ్‌కు ఇనయా సుల్తానాలు లీడర్‌లుగా వుంటారని చెప్పాడు బిగ్‌బాస్. గేమ్ స్టార్ట్ అవ్వగానే.... ఎక్కువమంది సభ్యులు వాటిని దక్కించుకునేందుకు పడుతూ లేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కొందరికి గొడవలు కూడా జరిగాయి.

ముఖ్యంగా శ్రీహాన్- సూర్యల మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది. శ్రీహాన్ తొడ కొడుతూ రెచ్చిపోగా... అర్జున్ మాటల ద్వారానే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత శ్రీసత్య చేతిలో బొమ్మ లాక్కునే క్రమంలో అది కింద పడింది. రేవంత్ ఏం చేసినా పదే పదే ఏదో ఒక పాయింట్‌ని పట్టుకుని అతనిని రెచ్చగొట్టింది శ్రీసత్య. దీంతో రేవంత్ రెచ్చిపోయాడు. అలా మొత్తం మీద అర్జున్, రేవంత్, రోహిత్, మెరీనా, శ్రీసత్య, సూర్య గొడవలు పడుతూనే గేమ్ ఆడారు. అందరిలోకి శ్రీహాన్ చురుగ్గా కనిపించాడు. చివరికి తొలి రౌండ్‌లో రెడ్ టీమ్ విజయం సాధించింది. రేపటి ఎపిసోడ్‌లో తదుపరి రౌండ్స్ కొనసాగుతాయి. ఈ టాస్క్‌లో విజయం సాధించిన టీమ్ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని... ఓడిపోయిన టీమ్‌లోని సభ్యులు నేరుగా నామినేట్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇనయా- శ్రీహాన్‌ల గురించే. బద్ధశత్రువుల్లా వీరిద్దరి మధ్య ఎందుకో స్నేహం చిగురించింది. రెండు రోజులుగా శ్రీహాన్‌కు బాగా దగ్గరవుతోంది ఇనయా. గురువారం అతని పుట్టినరోజును పురస్కరించుకుని ఇంట్లో నానా హడావుడి చేసింది. కేకుపై శ్రీహాన్ అని కాకుండా చోటు అని రాయించి దాని పక్కనే హార్ట్ సింబల్ వేయించింది. దీంతో నువ్వు చాలా బాగున్నావంటూ ఇనయాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు శ్రీహాన్. అంతే ఇంటిలోని ఆడ గుంపంతా వచ్చి అతని మీద మూకుమ్మడిగా దాడి చేసింది. మమ్మల్నందరినీ వదిలేసి కేవలం ఇనయాకు మాత్రమే కాంప్లిమెంట్ ఇస్తావా అంటూ అతనిని ఆడుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసిన శ్రీహాన్... మొదట ఇనయాకు తినిపించాడు. దీంతో షాక్ అవ్వడం ఇంటి సభ్యుల వంతైంది.

ఇదిలావుండగా.... ఈ వారం హౌస్‌ని వీడబోయేది ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు మెరీనా కాగా, రెండవ వ్యక్తి వాసంతి. వీరిద్దరూ ఆటలో పాల్గొనేది తక్కువ, మాట్లాడేది తక్కువ. నలుగురితో పాటు నారాయణ అనే టైపు. మెరీనా నిత్యం కిచెన్‌లోనో, తన భర్త రోహిత్ పక్కనో వుంటుంది తప్పించి ఎవరితోనూ గొడవ పెట్టుకుని, వాదించే రకం కాదు. వాసంతి బుట్టబొమ్మలా రెడీ అయి హౌస్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది తప్పించి ఆమె నుంచి పెద్దగా కంటెంట్ రాదు. ఇక ఈ వారం కెప్టెన్ సూర్య, గీతూ తప్పించి అందరూ నామినేషన్స్‌లో వున్న సంగతి తెలిసిందే.