BiggBoss: ఇనయా ఔట్... కంటతడిపెట్టిన లేడీ టైగర్, మిడ్ వీక్ మరో ఎలిమినేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఖచ్చితంగా టాప్ 5లో చోటు దక్కించుకుంటుందని అంతా భావించిన ఇనయాను బయటకు పంపారు. దీంతో ప్రేక్షకులు, ఇనయా అభిమానులు బిగ్‌బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. దీని వెనుక రాజకీయాలు వున్నాయని, మరొకరిని సేవ్ చేసేందుకు ఇనయాను బలి చేశారని ఆరోపిస్తున్నారు. ఆమె కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని కాదని లేడి సింగాన్ని ఎందుకు ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అయినా బిగ్‌బాస్ నిర్వాహకులు వీటిని పట్టించుకునేంత సీన్ లేదు.
మొదటి వారం నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ఇనయా పోరాటం చేసింది. ఒకానొక సమయంలో ఇంటి సభ్యులంతా ఒక్కటై ఇనయాను టార్గెట్ చేసిన సందర్భాలు ఎన్నో. బాధపడినప్పుడు ఒంటరిగా ఏడ్చింది.. కానీ అదే కసితో మళ్లీ పోరాటం చేసింది. గీతూ, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా కలిసి ఎన్నోసార్లు ఇనయాను టార్గెట్ చేశారు. కొన్ని సార్లు అసభ్యంగానూ ప్రవర్తించారు. కానీ వీటన్నింటినీ తట్టుకుని నిలబడింది. హౌస్‌లో తనకు ఎవరు మద్ధతుగా లేకున్నా, తాను కెప్టెన్ కాకుండా అడ్డుకున్నా ఓపికగా భరించింది. కానీ సీజన్‌కి చివరి కెప్టెన్‌గా.. సీజన్‌లో ది బెస్ట్ కెప్టెన్‌గా నిలిచింది. మగవాళ్లలో రేవంత్, ఆడవాళ్లలో ఇనయాలు టైటిల్ విన్నర్ అని అంతా భావించారు. వివిధ ఛానెళ్లు పెట్టే ప్రైవేట్ ఓటింగ్స్ కూడా ఇవే చెప్పేవి. ఇప్పుడు ఇంట్లో వున్న శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ కంటే ఇనయాకు ఎక్కువే ఓట్లు పడ్డాయి. కానీ వారిని సేవ్ చేసి ఆమెపై వేటు వేయడం వెనుక రాజకీయాలు ఏంటో తెలియదు గానీ... బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం షాకే. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ముందే అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్న ఇనయా అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
ఇదిలావుండగా ఆదివారం హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆటలు , పాటలు, డ్యాన్స్‌లతో ఇంటి సభ్యులు హోరెత్తించారు. అనంతరం నామినేషన్స్‌లో వున్న ఆదిరెడ్డి, ఇనయా, రోహిత్, శ్రీసత్యలలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా.. చివరికి ఆదిరెడ్డి, ఇనయాలు మిగిలారు. అనంతరం ఇనయా ఎలిమినేట్ అయినట్లుగా నాగ్ ప్రకటించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. కప్పు కొట్టాలన్న తన కల నెరవేరకుండానే ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో ఇనయా భావోద్వేగానికి గురైంది. ఇంట్లో నుంచి కంటతడితో స్టేజ్ మీదకు వచ్చిన ఇనయా.. మిగిలిన ఆ ఒక్క వారం కూడా వుండి ఫైనలిస్ట్‌ని అనిపించుకుంటే బాగుండేదని ఫీలైంది. తానెవరో తెలియకుండానే అంతా సపోర్ట్ చేశారని, ఇన్ని వారాలు హౌస్‌లో వుండటానికి వారే కారణమని ఇనయా కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత తన జర్నీని చూసుకుని కంటతడి పెట్టింది.
అనంతరం నాగార్జున ఆమెకు టాస్క్ ఇచ్చారు. ఇంట్లో వున్న ఆరుగురు సభ్యుల్లో ఒక గుడ్ క్వాలిటీ, ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పాలని కోరారు. శ్రీహాన్ చాలా మంచివాడని, అతడే టైటిల్ కొట్టి రావాలని ఆకాక్షించింది. ఆదిరెడ్డి నిజాయితీపరుడని.. శ్రీసత్య తనకు ఇష్టమైన వారి కోసం ఏమైనా చేస్తుందని .. నచ్చకపోతే వారిని రెచ్చగొడుతుందని చెప్పింది. కీర్తి చాలా స్ట్రాంగ్ అని.. కొన్నిసార్లు బాధపడినా మళ్లీ దాని నుంచి బయటపడుతుందని తెలిపింది. రేవంత్ తనకు నచ్చిందే ప్రతి ఒక్కరి మీదా రుద్దాలని చూస్తాడని చెప్పింది. రోహిత్ చాలా మర్యాదస్తుడని, కానీ తనలోని సామర్ధ్యాన్ని పూర్తిగా బయటపెట్టలేదని పేర్కొంది.
తర్వాత ఇనయా అందరికి వీడ్కోలు చెప్పి హౌస్‌ను వీడింది. మరోసారి బిగ్‌బాస్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ, ఇతర బహుమతుల గురించి చెప్పాడు. అలాగే ఫైనల్‌కి ఐదుగురు మాత్రమే వెళ్లాల్సి వున్నందున, ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ వుంటుందని ప్రకటించి షాకిచ్చారు. బుధవారం వరకు వచ్చిన ఓట్లు పరిగణనలోనికి తీసుకుని ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తామని నాగ్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments