'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' రివ్యూ
- IndiaGlitz, [Friday,June 18 2021]
ఓటిటిలో వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. కరోనా ప్రభావంతో సినిమాల జోరు తగ్గింది. దీనితో వెబ్ సిరీస్ లు ఎంటర్టైన్మెంట్ కు ఆధారం అయ్యాయి. ప్రియదర్శి ,నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' నేడు ఆహాలో స్ట్రీమ్ కావడం మొదలైంది. బోల్డ్ క్రైమ్ జోనర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలావుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కారు కారు డ్రైవర్ గా పనిచేసి సాధారణ కుర్రాడు ఆది(ప్రియదర్శి). చిన్న చిన్న మెకానిక్ పనులు కూడా చేస్తుంటాడు. ఏదో విధంగా బాగా డబ్బు సంపాదించాలనే కోరిక అతడిది. అదే ఊర్లో ఉండే వ్యక్తి అయ్యప్ప(పోసాని కృష్ణమురళి). ఆదికి, అయ్యప్పకు మంచి పరిచయం ఉంటుంది. అయ్యప్ప భార్య మీనా (నందిని రాయ్). మీనాకు వేరే కుర్రాడితో ఎఫైర్ సాగుతూ ఉంటుంది.
అయ్యప్ప ఇంటికి వెళ్ళినప్పుడు అందరి కుర్రాళ్ళ లాగానే మీనా అందానికి ఆకర్షితుడవుతుంటాడు ఆది. అయ్యప్పకు ఓ తమ్ముడు ఉంటాడు. క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒకరోజు అయ్యప్పకు అతడి తమ్ముడు 5 కోట్ల డబ్బు ఉండే సూట్ కేస్ ఇస్తాడు.
అదే సమయంలో నందిని గుట్టు రట్టవుతుంది. ఇక్కడే కథలో అసలు మలుపు చోటు చేసుకుంటుంది. కథలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఆది తీవ్రమైన చిక్కుల్లో చిక్కుకుపోతాడు. మరో వైపు భాయ్ అనే మాఫియా గ్యాంగ్ వ్యవహారం కూడా పార్లల్ గా సాగుతూ ఉంటుంది.
తన బండారం బయట పడ్డాక మీనా ఏమైంది ? ఆది ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు ? ఆ 5 కోట్ల వ్యవహారం ఏంటి ? వీటన్నింటికి సమాధానమే ఈ వెబ్ సిరీస్ కథ.
విశ్లేషణ:
సాధారణ క్రైమ్ కథకు ఎక్కువ వయొలెన్స్, కాస్త బోల్డ్ రొమాన్స్ తో మెరుగులు దిద్దారు. ఈ వెబ్ సిరీస్ రెండు మూడు ఎపిసోడ్స్ పాటు చాలా నెమ్మదిగా అనిపిస్తుంది. కథని నడిపించడానికి హుక్ చేసిన ఓ సన్నివేశం మాత్రమే తొలి మూడు ఎపిసోడ్స్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బూతు డైలాగులా డోస్ ఎక్కువ కావడంతో చికాకు పుడుతుంది.
ఆ తర్వాత వేగం పుంజుకున్నప్పటికీ గందరగోళం ఎక్కువవుతుంది. కథలో కొత్త పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి. కాలయాపన చేసేందుకు మాత్రమే ఆ పాత్రలని వాడుకున్నట్లు అనిపిస్తుంది కానీ కథకు బలం చేకూరేందుకు కాదు.
కథలో క్రైమ్ జరిగినప్పుడు దానిని చేధించే దిశగా ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్ ఉండాలి. కానీ ఈ వెబ్ సిరీస్ లో పోలీసుల పాత్ర చాలా తక్కువ. హీరో తనని తాను రక్షించుకునేందుకు, డబ్బు సంపాదించేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. కథలో ట్విస్ట్ ఛేదించే ఉద్దేశమే హీరో పాత్రలో కనిపించదు.
కథలో జరిగిన ఓ కీలక సంఘటన వల్ల హీరోయిన్ పాత్ర ఇంకా ఆసక్తిగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఆ తర్వాత తేలిపోతుంది. నందిని రాయ్ తన ప్రయత్నాలు తాను ఉంటూ సాఫీగా ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఒకరి రెండు మినహా ఆమెకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. ఆది నటన, నందిని రాయ్ గ్లామర్ ఈ వెబ్ సిరీస్ ని కొంత వరకు కాపాడాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ సీజన్ కు రెడీ కండి అంటూ ఓ నాసిరకమైన ట్విస్ట్ తో తొలి సీజన్ ముగుస్తుంది.
నటీనటులు:
ఈ వెబ్ సిరీస్ కు సేవియర్స్ అంటే ప్రియదర్శి, నందిని రాయ్ పాత్రలే. పోసాని కూడా బాగానే చేశారు. ప్రియదర్శి అయితే తాను కమెడియన్ మాత్రమే కాదు అని ఎలాంటి నటన అయినా తనకు సాధ్యమే అని నిరూపించుకున్నాడు. కథలో ఎమోషనల్ సీన్స్ అంతగా లేవు. ఉన్న ఒకటి అరా సన్నివేశాల్లో బలం లేదు. కానీ ప్రియదర్శి హావభావాలు మెప్పిస్తాయి.
ఇక నందిని రాయ్ పాత్ర సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. తొలి ఎపిసోడ్ లో వచ్చే కీలక సన్నివేశంలో నందిని రాయ్ నటన అద్భుతం. ఆ తర్వాత కూడా ఆమె పాత్రని అలాగే కొనసాగించి ఉండాల్సింది. కానీ కథ వేరేలా ఉండడం వల్ల నందిని పాత్ర డీవియేట్ అయినట్లు, ప్రాధాన్యత తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. గ్లామర్ గా కనిపిస్తూనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది.
పోసాని ఉన్నత సేపు ఎంటర్టైన్ చేశారు. మిగిలిన పాత్రల్లో కొందరికి మాత్రమే నటించే స్కోప్ దొరికింది. నందిని రాయ్ తో ఎఫైర్ ఉన్న యువకుడి పాత్ర మెప్పించే విధంగా ఉంటుంది. సన్నివేశాల్లో వార్నింగ్ సీన్స్ లో బూతులు ఎక్కువ కావడంతో నెగటివ్ రోల్స్ లో నటించిన అందరి నటన ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సాంకేతికంగా:
క్రైమ్ కథకు డైలాగులు చాలా కీలకం. కానీ ఈ వెబ్ సిరీస్ లో అబ్యూస్ లాంగ్వేజ్ ఎక్కువగా నడిచింది. బూతు డైలాగులు బాగా తగ్గించి ఉండాల్సింది. క్రైమ్, బోల్డ్ కథాంశాలు ఇష్టపడే వారికి కూడా ఈ డైలాగులు చికాకు పుట్టిస్తాయి. తొలి మూడు ఎపిసోడ్స్ కి ఎడిటింగ్ లో కొత్త పెట్టి ఉంటే బావుండేది.
నేపథ్య సంగీతం ఓకె అనిపిస్తుంది. బాషా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్ కు నిర్మాత. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం చాలా బావున్నాయి. కెమరామెన్ పనితనం మెప్పించే విధంగా ఉంటుంది.
హీరో పాత్రకు సమస్యలు మొదలయ్యాక వచ్చే సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. దర్శకుడు విద్యాసాగర్ ఆసక్తికరమైన క్రైమ్ సీన్ చుటూ కథని నడిపించాలనుకోవడం మంచిదే. కానీ ఆ నడిపించిన విధానం బెడిసికొట్టింది.
ఫైనల్ పంచ్:
ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ అంశం చుట్టూ వీక్ నెరేషన్ తో సాగే వెబ్ సిరీస్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు, ప్రియదర్శి,నందిని రాయ్, పోసాని ల పెర్ఫామెన్స్ ఇందులో పాజిటివ్ పాయింట్స్.
రేటింగ్ : 2/5