'డేటా చోరీ' కేసులో కీలక వ్యక్తి.. ఆయన దొరికితే..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘డేటా చోరీ’ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన హైదరాబాద్ పోలీసులు.. డేటాకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందుకు సంచలన నిజాలు వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన అశోక్ పోలీసుల ఎదుట హాజరవ్వకపోవడంతో లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరించారు.
అమెజాన్‌ను కోరాం..
"రహస్యంగా ఉండాల్సిన సమాచారం ‘ఐటీ గ్రిడ్’ కు చెందిన సర్వర్ లో చేరింది. దీని ద్వారా ఆ సమాచారాన్ని ‘సేవామిత్ర’ వాడుకుంటోంది. సర్వర్లలో నిక్షిప్తం చేసిన పూర్తి డేటా ఇవ్వాలని అమెజాన్ సంస్థను కోరాము. ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు పంపడం జరిగింది" అని అంజనీకుమార్ మీడియాకు వివరించారు.
ఇదీ అసలు కథ..
"క్షేత్ర స్థాయిలో ఆధార్ నెంబర్, విద్య, సామాజిక వర్గం వివరాలు సేకరిస్తారు. ఆ వివరాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ పరిశీలిస్తుంది. సేవా మిత్ర’ వెబ్‌సైట్‌లో బూత్ కన్వీనర్, డ్యాష్ బోర్డు వివరాలు ఉన్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ వారు తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తారు. ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగి తెలుసుకుని, సర్వేయర్లు ఈ సమాచారాన్ని టీడీపీ బూత్ లెవెల్ అధికారులకు చేరవేస్తారు. ఓటర్ అభిప్రాయం, సదరు ఓటర్ అక్కడే ఉంటున్నారా? లేదా? అన్న దానిపై సర్వే చేస్తున్నారు. అటువంటి వారిని లక్ష్యంగా చేస్తూ సర్వే చేస్తున్నారు" అని అసలు వ్యవహారాన్ని అంజనీకుమార్ బయటపెట్టారు.
కీలక వ్యక్తి.. కోడ్ భాషతో..!
" ఈ వ్యవహారం మొత్తం హైదరాబాద్‌లో జరిగింది.. అందుకే ఇక్కడే కేసు నమోదు చేశాము. ఐపీసీ 420,490,467,468, 471,120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. ఐటీ గ్రిడ్ డైరెక్టర్ నిందితుడు అశోక్‌ను త్వరలో పట్టుకుంటాము. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని కోడ్ భాషతో పిలుస్తున్నారు. ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నాము. ఆ కీలక వ్యక్తి ఎవరన్నది త్వరలోనే తేలుస్తాము" అని అంజనీకుమార్ మీడియాకు వివరించారు. ఆ కీలక వ్యక్తి దొరికితే అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న పెద్ద తలకాయలేవి.. నేతలు ఎవరు..? అనే విషయాలు తెలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కీలక మలుపు తిరిగిన కేసు..
డేటా చోరీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఐటీ గ్రిడ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై ఏపీ టీడీపీ కన్నెర్రజేస్తోంది. మా డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని కేసు పెట్టాలని తెలుగుతమ్ముళ్లు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. తెలంగాణ సర్కార్‌పై పరువునష్టం దావా వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మాటల యుద్ధం, విమర్శలు, ఆరోపణలు చేసుకుంటుండగా... తాజా పరిణామంతో ఈ కేసులో కీలక మలుపు తిరిగిందని.. అయితే కోర్టులు దాకా పంచాయితీ వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో మరి వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments