జగన్ పాదయాత్ర ముగింపుకు వెళ్లనంటున్న కీలకనేత
- IndiaGlitz, [Tuesday,January 08 2019]
వైసీపీ సీటు వ్యవహారంలో మొదలైన వంగవీటి రాధా వివాదం ఇంకా సద్దుమణగలేదు. అప్పట్నుంచి రగులుతున్న అసంతృప్తికి నేటీకీ ఫుల్‌స్టాప్ పడలేదు. గత కొద్దిరోజులుగా వైసీపీ కార్యక్రమాలకు రాధా పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే రేపు అనగా.. జనవరి 9న వైసీపీ అధినేత, ఏపీ ప్రధానప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు భారీ జనసమీకరణతో ఇచ్ఛాపురంకు తరలివెళ్తున్నారు.
అయితే.. ఈ తరుణంలో వంగవీటి రాధా మాత్రం జగన్ పాదయాత్ర ముగింపునకు వెళ్లనని తేల్చేసినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ సీటులో విభేదాలే రాధా అసంతృప్తికి కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా రాధాకు నేరుగా ఆహ్వానం పంపకుండా కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించారని ఆయనే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాధా పోటీ చేసే అవకాశాలపై పార్టీ వర్గాల్లో గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. కాగా గత నెలలో జరిగిన వంగవీటి వర్ధంతి కార్యక్రమంలో కూడా పెద్దగా వైసీపీ కార్యకర్తల హడావుడి.. కనీసం పార్టీ జెండాలు కూడా కనపడలేదు. దీంతో విజయవాడ వైసీపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాధాకు ఆహ్వానం ఎందుకు పంపలేదు..? అంటే ఆయన్ను పూర్తిగా పక్కనెట్టేశారా..? లేకుంటే చెప్పడం మరిచిపోయారో తెలియదు కానీ మరోసారి అసంతృప్తితో రగిలిపోతున్న రాధా మాత్రం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారని చెప్పుకోవచ్చు.