Pensions: ఏపీలో ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేళ ఎట్టకేలకు పింఛన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది. మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యం, వీల్ ఛైర్లో ఉన్నవారికి సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే పింఛన్ అందించనున్నారు. మొత్తం 14,995 గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఈ సేవల కోసం వినియోగించనున్నారు. లబ్ధిదారుల కోసం 10,814 కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి పింఛను పంపిణీని పర్యవేక్షించనున్నారు.
ఒకవేళ ఏదైనా సమస్యతో బ్యాంకు అకౌంట్లలో నగదు జమ కాకపోతే వారికి మే 2న ఇంటి దగ్గరే నగదు అందించనున్నారు. బ్యాంకు అకౌంట్ల ద్వారా స్వీకరించే వారి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. మే 5 నాటికి పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. రాష్ట్రవ్యాప్తంగా 65.50 లక్షల మంది పింఛనుదారుల్లో.. 48.92 లక్షల మంది(75%) బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమైనట్టు గుర్తించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తెలిపారు.
వీరందరికీ పింఛను మొత్తాన్ని మే 1న నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు చెప్పారు. మిగతా 16.58 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి అందిస్తామన్నారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 బ్యాంకులకు సెలవైనప్పటికీ... ఆరోజు సంబంధిత కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ అవుతుందన్నారు. పింఛన్ల పంపిణీల్లో సచివాలయాల సిబ్బంది ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
కాగా ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో తీవ్ర గందరగోళం పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇంటింటికి పింఛన్ పంపిణీలో ఆలస్యం కావడంతో వృద్ధులు ఎండల్లో సచివాలయాల దగ్గరకు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మే నెల పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని టీడీపీ కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదుచేశాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వానికి ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com