Krishna Board:తక్షణమే సాగర్ నీటి విడుదల ఆపండి.. ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై తమకు ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వాస్తవంగా అక్టోబర్ 10 నుండి 20 వరకు 5 టీఎంసీలు, జనవరి 8 నుండి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుండి 24 వరకు 5 టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు కృష్ణా బోర్డు సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటికే అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో 5.01 టీఎంసీలు ఏపీకి విడుదలయ్యాయి. ఇక వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్లో నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం బలవతంగా కుడి కాలువ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదలు చేసింది.
మరోవైపు సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం సరైనదేనని, తమ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. తమకు ధర్మం ప్రకారం రావాల్సిన నీటిని రైతుల పంటల కోసం విడుదల చేస్తే తప్పేంటని నిలదీశారు. తమ వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోమని అంబటి తెలిపారు. ఆంధ్రా భూభాగంలోకి తమ పోలీసులు వెళ్లడం తప్పు ఎలా అవుతుందని, ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులు చెల్లవన్నారు. ఇక సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఏపీ పోలీసులు భారీగా మోహరించగా.. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. డ్యాంపై ఏర్పాటు చేసిన ముళ్లకంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు యత్నించగా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments