Weather Forecast : మరో ఆరు రోజులు వానలే వానలు .. తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్
- IndiaGlitz, [Thursday,April 27 2023]
భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతుంటే తెలంగాణలో మాత్రం విచిత్ర వాతావరణం నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పగలు ఎండలు మండిపోతుంటే.. సాయంత్రానికి వర్షం పడుతోంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చలి వేస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా ఇదే పరిస్ధితి కనిపిస్తుండగా.. మరో ఆరు రోజులు ఇలాగే వుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ విదర్భ నుంచి ఉపరితల ఆవర్తనం:
అయితే కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల వానలు పడుతుండగా రైతులు అల్లాడిపోతున్నారు. అకాల వర్షాలతో చేతికందిన పంటలు అన్నదాతను నిండా ముంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. రానున్న ఆరు రోజుల్లో ఏపీ, తెలంగాణలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో కొన్ని చోట్ల వడగళ్ల వానలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో పాటు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు:
తెలంగాణలోని నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, మెదక్, సంగారెడ్డి. జనగామ , హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది. వానలు కురుస్తూ వుండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. బుధవారం గరిష్టంగా నల్గొండలో 38.5 డిగ్రీలు నమోదవ్వగా.. హన్మకొండలో అత్యల్పంగా 19.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలిగా వుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.