ఐమాక్స్ థియేటర్ ఆపరేటర్ ఆత్మహత్య..
- IndiaGlitz, [Monday,September 14 2020]
సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కొద్ది మంది మాత్రమే.. నటీనటులతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకు మించి ఒకరిద్దరు మినహా మనకు తెలియదు.. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యం. ఈ సినిమా రంగంపై ఆధారపడిన జీవితాలెన్నో.. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్‌లు లేవు.. థియేటర్లూ మూతపడ్డాయి. దీంతో సినీ రంగంపై ఆధారపడిన ఎన్నో జీవితాలు రోడ్డున పడ్డాయి. మరికొన్ని జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.
ఐమాక్స్ థియేటర్లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్(52) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. భాస్కర్ మనకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఐమాక్స్‌లో మనం ఎంజాయ్ చేసిన సినిమాల వెనుక మాత్రం ఆయనున్నారు. లాక్డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతపడిపోయాయి. ఈ నేపథ్యంలో ఐమాక్స్ యాజమాన్యం ఈ నెల వరకూ తమ సిబ్బందికి సగం జీతం ఇచ్చింది. అసలే.. పూర్తి జీతం వస్తేనే అతి కష్టంగా జీవితాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సగం జీతం అంటే ఎంత కష్టం?
అయినా సరే.. అప్పో సప్పో చేసుకుంటూ ఇప్పటి వరకూ కుటుంబాన్ని భాస్కర్ ఎలాగో నెట్టుకొచ్చారు. కానీ వచ్చే నెల నుంచి ఈ సగం వేతనం కూడా ఇవ్వలేమంటూ ఐమాక్స్ యాజమాన్యం ప్రకటించింది. విషయాన్ని సహోద్యోగి ద్వారా తెలుసుకున్న భాస్కర్.. ఖైరతాబాద్‌లోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.