ఇళయరాజా దురుసు ప్రవర్తన.. కాళ్లు పట్టుకున్న వైనం!
- IndiaGlitz, [Tuesday,June 04 2019]
లయరాజు.. ఇళయరాజా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఈయన గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. తన ప్రముఖ సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుని సంగీతానికి ‘రారాజు’గా నిలిచారు. అయితే అంతకురెట్టింపుగా ఈయన వివాదాస్పద పనులతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే.. తాను కంపోజ్ చేసిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదించడంపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనమైంది.. పెద్ద ఎత్తున వార్తలు ఇళయరాజాపై పుట్టుకొచ్చాయి. తాజాగా మరోసారి వివాదంతో ఆయన వార్తల్లో నిలిచారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఇళయరాజా జూన్-02న 76వ పడిలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, కుటుంబీకులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అంగరంగ వైభవంగా జరిపుకున్నారు. బర్త్త్ డే సందర్భంగా.. చెన్నైలో పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలసుబ్రహ్మాణ్యం, జేసుదాసుతో పాటు పలువురు సంగీత దర్శకులు, గాయకులు, గాయనులతో పాటు ప్రముఖులు విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఒకానొక సందర్భంలో ఇళయారాజా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
లయలరాజు దురుసు ప్రవర్తన!
బర్త్ డే వేడుకల కార్యక్రమంలో భాగంగా ఇళయరాజా చాలా సీరియస్‌గా ఏదో మాట్లాడుతుండగా.. ఓ సెక్యూరిటీ గార్డు మంచి నీళ్ల సీసాలు ఇవ్వడానికి స్టేజ్ పైకి వచ్చాడు. ఆయన పని ఆయన చేసుకుంటుండగా.. ఇళయరాజా మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ హేయ్.. ఏంటిది.. అనుమతి లేకుండా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్?’ అని ఆగ్రహంతో ఊగిపోయి.. సెక్యూరిటీ గార్డ్‌ను తిట్టిపోశారు. అంతపెద్ద మనిషి ఆగ్రహానికి లోనై.. దురుసుగా ప్రవర్తించడంతో బిత్తరపోయిన సెక్యూరిటీ మన్నించండి సారూ.. అంటూ నమస్కరించారు.. అయితే అప్పటికీ ఇళయరాజా ఆగ్రహం తగ్గకపోవడంతో ఈసారి ఏకంగా ఆయనగారి కాళ్లు పట్టుకున్నారు. అంతటితో ఆగని ఆయన.. మరోసారి తన నోటికి పనిచెప్పారు.. రూ.10 వేలు ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 ఇచ్చి సీట్లు కొనుక్కున్నవారు ఎలా కూర్చుంటారు..? అని నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.
కన్నెర్రజేస్తున్న నెటిజన్లు!
అయితే ఈ తతంగం అంతా రికార్డ్ అవుతోందని ఇళయరాజా తెలుసుకోలేకపోయారు. అయితే ఎవరో ఓ వ్యక్తి ఈ వ్యవహారం మాత్రం తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు.. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు ఈయనకు ఎప్పుడు వార్తల్లో నిలవాలంటే సరదా ఏమో..? అందుకనే ఇలా అస్తమానూ చేస్తుంటారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు పెద్దాయన ఎందుకిలా చేస్తున్నారు..? సెక్యూరిటీ గార్డ్ .. ఆయన పని చేసుకుంటున్నాడు కదా మధ్యలో ఈ పెద్దాయనేంటో..?.. సరిగ్గా సర్వింగ్ చేయకపోతే మళ్లీ అదే గార్డ్‌ను తిట్టిపోస్తారు.. చేస్తే ఇలా ఆడుకుంటారు.. అసలేంటయ్యా ఇది..? అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆఖరున శుభవార్త!
ఇదిలా ఉంటే.. ఇదే వేడుక ముగింపు సమయంలో ఇళయరాజా సంచలన ప్రకటన చేశారు. సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా ప్రకటించారు. అప్పటి వరకూ సెక్యూరిటీ గార్డ్ వ్యవహారంతో.. ఇళయరాజా మాటలతో కాస్త విసుగుచెందిన సభికులు, సంగీత దర్శకులు.. ఆయన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, సంగీత ప్రియలు గుడ్ సార్.. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ మెచ్చుకుంటున్నారు.