Pawan Kalyan:వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదు: పవన్ కల్యాణ్‌

  • IndiaGlitz, [Thursday,March 07 2024]

రాయలసీమ ఐదుగురు నేతల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమలో ఇంకేమి మిగలదన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమ మొత్తం బానిస సంకెళ్లతో నిండిపోయిందని.. చిత్తూరు జిల్లా ఓ కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని వాపోయారు.

వ్యక్తిగతంగా తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డితో విభేదాలు లేవని.. వారి ఆధిపత్యం మీదనే తన పోరాటమన్నారు. ఎర్రచందనం దుంగలు కొట్టే వారిని ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారని అలాంటి వారు గెలిస్తే పరిస్థితి ఏంటన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇది 2009 కాదని.. 2024 అని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని...కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. ప్రజా పోరాటాలకు రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కానీ.. ఎన్నికలు వచ్చే సరికి వెనక్కి తగ్గుతారన్నారని తెలిపారు.

నిన్నటి దాకా తనకు సలహాలు ఇచ్చినా వారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లారంటూ కాపు నేతలపై సెటైర్లు వేశారు. తనకు సీట్లు ఇవ్వడం.. తీసుకోవడం తెలియదా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడే వాళ్లు పద్దతిగా మాట్లాడాలని సూచించారు. పవన్ కల్యాణ్‌ దగ్గరికి వచ్చే సరికి వీరికి అన్ని గుర్తుకువస్తాయని విమర్శించారు. కాగా హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్‌ ఇప్పటికే వైసీపీలో చేరగా.. ముద్రగ కుటుంబం కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అలాగే సెర్చ్ వారెంట్ లేకుండా జనసేన సిబ్బంది దగ్గరికి పోలీసులు వచ్చారని.. వైసీపీకి కొమ్ముకాస్తున్న పోలీసులను తమ ప్రభుత్వం వచ్చాక గుర్తుపెట్టుకుంటానని హెచ్చరించారు.

ఇక ఆరణి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం నుంచి తానొక్కడ్నే ఎమ్మెల్యేనని అయినా కానీ తనను అవమానించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే తపిస్తారని.. ఆయన ఒక్కో మాట.. ఒక్కో తూటా.. ఆయన విధానాలు నచ్చడంతో పార్టీలో చేరానని స్పష్టంచేశారు. ఇక నుంచి పవన్ కళ్యాణ్‌తో నడుస్తా అంటూ చెప్పుకొచ్చారు. రాయలసీమలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సీమలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.