Chandrababu: అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని.. అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పని చేస్తుందని చెప్పారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన సందర్భంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పొత్తు పెట్టుకున్నామని పునరుద్ఘాటించారు. ఈసారి ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని, పుంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని స్పష్టంచేశారు.రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని వెల్లడించారు.
ఇంకా ఏం అన్నారంటే..
'ఇప్పటిదాకా మీరు నాపై ఏడుసార్లు అభిమానం చూపించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అడ్డుపడింది. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తాం. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నా. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా.. జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయడం ఆపలేదు. వైసీపీ నాయకులు యథేచ్చగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. కేజీయఫ్ తరహాలో శాంతిపురంలో గ్రానైట్ తవ్వేశారు. ఈసారి కుప్పంలో టీడీపీకి లక్ష మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నాను"అని చంద్రబాబు తెలిపారు.
"వచ్చే ఐదేళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నాదే. వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. వై నాట్ పులివెందుల.. అని నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ధి చేశా. ఆ తర్వాత దాని చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగాయి. రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు. మన భూమి, స్థలాలను కాపాడుకునేందుకు ఇన్ని బాధలు పడాలా? అరాచకాలకు అడ్డుకట్టవేయాలంటే కూటమి అధికారంలోకి రావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరం. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కాపాడింది మన పార్టీయే. వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించాం. ప్రతి నియోజకవర్గానికి ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తాం" అన్నారు.
దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ.. వారికి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి మరీ కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆలోచన చేసిందే టీడీపీ. 2 కోట్ల మంది మహిళలకు హామీ ఇస్తున్నా. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తాం. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అకౌంట్‌లో వేస్తాం. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోంది. జగన్ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయింది. తాము అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తాం" అని చంద్రబాబు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments