ఇదే నిజమైతే.. టీఆర్ఎస్ ఖేల్ ఖతమే..
- IndiaGlitz, [Monday,November 30 2020]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీఆర్ఎస్‌కైతే ఈ ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్‌గా మారాయి. అందుకే ఈ ఎన్నికలను ఈ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఫలితం రిపీట్ అవకుండా చూసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలనేదే ఆ పార్టీ లక్ష్యం. మరోవైపు బీజేపీ కూడా జీహెచ్ఎంసీపై దృష్టి సారించింది. అధి నాయకత్వం వచ్చి మరీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని ఈ పార్టీ భావిస్తోంది.
అయితే తెలంగాణలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్‌కు ఆరంభం నుంచి అండగా ఉంటూ వస్తోంది. గతంలో ఏమో కానీ.. ప్రస్తుత తరుణంలో మాత్రం ఎంఐఎం పార్టీ అండ టీఆర్ఎస్‌కు అత్యవసరం. కానీ ఆ పార్టీ అండ ఎవరికి ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీపై ఎంఐఎం మాటల తూటాలను పేల్చింది. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అని.. ఇరు పార్టీలు అంతర్గతంగా కలిసే ఉన్నాయని టాక్ నడిచింది. మరోవైపు ఎంఐఎం.. అంతర్గతంగా బీజేపీతో పొత్తు పెట్టుకుందని టాక్ నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుకుంటూ వస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ నిజంగానే బీజేపీకి ఎంఐఎంతో అంతర్గతంగా పొత్తు ఉందని చర్చించుకుంటున్నారు. ఇదే నిజమైతే టీఆర్ఎస్ ఖేల్ ఖతమేనని భారీగా చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్, ఎంఐఎం కలిస్తే జీహెచ్ఎంసీని చాలా ఈజీగా దక్కించుకోవచ్చు. టీఆర్ఎస్‌కు 38 దాకా.. ఎక్స్ అఫీషియో ఓట్లు ఉంటే.. ఎంఐఎంకు 10 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు ప్రతి ఓటు కీలకమే. ఈ నేపథ్యంలో ఎంఐఎం మద్దతును టీఆర్ఎస్ కోల్పోతే ఆ పార్టీకి తీరని నష్టం చేకూరే అవకాశం ఉంది. మొత్తానికి మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. మరి ఓటరు తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తేలాల్సి ఉంది.