రెఫరెండం పెడితే 3 ప్రాంతాల ప్రజలు మాతో ఏకీభవిస్తారు: జగన్
- IndiaGlitz, [Wednesday,September 09 2020]
ఏపీ సీఎం జగన్ అమరావతిపై కక్ష పెంచుకున్నారంటూ వస్తున్న ఆరోపణలో ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. తామేమీ అమరావతిని వదిలివేయడం లేదని అలాంటప్పుడు కక్ష పెంచుకున్నట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. లెజిస్లేటివ్ విభాగమంతా అమరావతి నుంచే పని చేస్తుందని... అయితే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మాత్రం కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతీ విషయంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేయరు కాబట్టే నిపుణుల అభిప్రాయం మేరకు తాము నడుచుకుంటున్నామన్నారు. ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ చేసినా కూడా మూడు ప్రాంతాల ప్రజల మద్దతు తమకే ఉంటుందని జగన్ వెల్లడించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేస్తే తాము తమ కమిటీని నియమించామని జగన్ వెల్లడించారు. ఆ కమిటి నివేదిక మేరకే నడుచుకున్నామన్నారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజలకు అవసరమైన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మెడికల్ కాలేజీల వంటివి నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు. చంద్రబాబు చేస్తున్న నిఘా ఆరోపణలు సత్యదూరమని.. వాటికి ఆధారాలు సమర్పించాలని డీజీపీ కోరారన్నారు. ఈ సందర్భంగా తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఆధారాలతో సహా నిరూపించామని జగన్ స్పష్టం చేశారు.