CM Jagan:నాన్న శంకుస్థాపన చేస్తే.. కొడుకు ప్రారంభించాడు.. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. జిల్లా వాసుల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు నాడు తండ్రి శంకుస్థాపన చేస్తే.. నేడు ఆయన కొడుకు ప్రాజెక్టును ప్రారంభించడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును నేడు సీఎం జగన్ ప్రారంభించారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండు టన్నెళ్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
మొదట దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయన కొడుకుగా తాను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర నిర్మాణాలు పూర్తయ్యాయని.. కానీ చంద్రబాబు వచ్చాక 2014 నుంచి 2019 వరకూ 6.6 కి.మీలు మాత్రమే నిర్మాణం జరిగిందని మండిపడ్డారు.
"ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తైంది. ఆ టన్నెల్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీర్చడమే కాకుండా.. సాగునీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే.. ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది" అని జగన్ అభిప్రాయపడ్డారు.
కాగా వెలిగొండ ప్రాజెక్టును 2004లో జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. 2005 అక్టోబరులో శిలాఫలకం వేసి పనులు ప్రారంభించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల నడుమ ఉన్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద మూడు వాటర్ స్టోరేజ్ పాయింట్ల వద్ద కాంక్రీట్ డ్యాముల నిర్మాణం చేశారు. శ్రీశైలంలోని కృష్ణా జలాలను తరలించేందుకు నల్లమల భూగర్భంలో దోర్నాల మండలం కొత్తూరు నుంచి కొల్లంవాగు వరకు 18 కి.మీ మేర రెండు సొరంగాలను తవ్వాలని నిర్ణయించారు. అందులో మొదటి సొరంగం నిర్మాణాన్ని 2021 జనవరి 13న పూర్తిచేశారు. రెండో సొరంగం పనులు ఇటీవలే పూర్తి అయ్యాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మరోవైపు వచ్చే ఖరీఫ్‌లో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి నింపనున్నారు. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీ నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తరలించనున్నారు. ఇక దాదాపు 3 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న మొదటి టన్నెల్, 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments