పవన్ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తా: వీహెచ్
- IndiaGlitz, [Saturday,December 26 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆఫర్ ఒకటి ఇచ్చారు. ఆయన తమ పార్టీలోకి వస్తే పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని వీహెచ్ ప్రకటించారు. నేడు వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా దొండపాడులో రంగా విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారన్నారు. వంగవీటి రంగా తర్వాత పవన్‌కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం అవుతాడనే రంగాను హత్య చేశారని ఆరోపించారు.
కేవలం 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. బీసీలకు పీసీసీ చీఫ్ ఇవ్వాలన్నందుకే తనను బెదిరిస్తున్నారని.. అలాంటి వాటికి తాను భయపడబోనని వీహెచ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రాణం పోయినా బాధపడబోనన్నారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దళితులను సీఎంను చేస్తానని మోసగించాడన్నారు. కాగా.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరు ఇప్పటికే ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిని వీహెచ్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. రేవంత్‌కు టీపీసీసీ ఇస్తే కాంగ్రెస్‌ను వీడేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు.